
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నలో పని చేస్తోన్న మోదీ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. విద్వేషం, లాఠీలు, తూటాలు, తప్పుడు వాగ్ధానాలతో దేశాన్ని నడిపించలేరని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శివమొగ్గలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
‘‘దళితులను, గిరిజనులను ఈ బీజేపీ సర్కార్ దారుణంగా మోసం చేస్తున్నది. దేశంలోని ఎస్సీ, ఎస్టీలందరికీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తున్నదో.. అంతకు రెట్టింపు నిధులను కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు ఖర్చుచేస్తున్నది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. బీజేపీకి దళితులంటే ఎంత ప్రేమ ఉందో’ అని రాహుల్ అన్నారు. పరీక్షా పత్రాల నుంచి డోక్లాం సమస్య దాకా అన్నింటా మోదీ వైఫల్యం చెందారని, యడ్యూరప్ప లాంటి అవినీతిపరులను పక్కనే ఉంచుకొని మోదీ నీతివచనాలు వల్లిస్తారని కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు.
ఖర్గే ఫైర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్టులో మార్పులు, భారత్ బంధ్ నేపథ్యంలో తలెత్తిన హింస తదితర అంశాలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఉందా? బీజేపీ పార్టీ కార్యాలయాల్లో అంబేద్కర్ బొమ్మకూడా కనబడదు. అలాంటి వీళ్లు దళితులను ఉద్ధరించడానికే చట్టాల్లో మార్పులు చేశామంటే నమ్మాలా?’ అని ఖర్గే ఫైర్ అయ్యారు.