ముంబై: దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని ఢీకొట్టే సత్తా వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..మోదీ,షా ద్వయానికి సరైన ప్రత్యర్థి రాహుల్ గాంధీయేనని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ.. రాహుల్ గాంధీనే కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలని తాను ఆకాంక్షించానని తెలిపారు. దేశంలో కీలక సమస్యలైన రైతులు, ఉపాధి, నిరుద్యోగం, ద్రవ్యోల్భణంపైన రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. దేశ ప్రజల ముఖ్య సమస్యలపై పోరాడే కాంగ్రెస్ జాతీయవాద పార్టీ కాదా అని ప్రశ్నించాడు.
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనిచ్చిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. రాహుల్ లేవనెత్తిన ప్రజా సమస్యలను బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్‌తో మభ్యపెట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన రఫేల్ కేసు మగిసినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రఫేల్ కేసు గురించి జేపీసీ నియమించడంలో బీజేపీ ఎందుకు వెనుకంజ వేస్తుందని నిలదీశారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రచారం చేసిన ఆర్టికల్ 370 రద్దును చూసి ఓటెయ్యలేదని అశోక్ గెహ్లాట్ అన్నారు. అందుకే ఈ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని పక్కన పెట్టిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment