మోదీ నాలుగేళ్ళ ప్రోగ్రెస్‌; ఎన్ని మార్కులో తెలుసా? | Congress Observes May 26 As Vishwasghaat Diwas And Releases India Betrayed Book | Sakshi
Sakshi News home page

మోదీ నాలుగేళ్ళ ప్రోగ్రెస్‌; ఎన్ని మార్కులో తెలుసా?

Published Sat, May 26 2018 4:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Observes May 26 As Vishwasghaat Diwas And Releases India Betrayed Book - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ పాలనకు నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా విపక్ష కాంగ్రెస్‌ ‘విశ్వాసఘాతుక దినం’ పేరుతో శనివారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ప్రచారం చేపట్టింది. అన్ని రంగాల్లో మోదీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ‘మోసపోయిన భారతం’ పేరుతో భారీ పుస్తకాన్ని విడుదల చేసింది. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, రణదీప్‌ సుర్జేవాలా తదితరులు పీడీఎఫ్‌ రూపంలోని బుక్‌లెట్‌ను విడుదల చేశారు.

‘మోసపోయిన భారతం’ పుస్తకంలో మొత్తం 40 అంశాలను ప్రస్తావిస్తూ, ఆయా అంశాల్లో మోదీ వైఫల్యాన్ని ఎండగట్టేప్రయత్నం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ‘కిసాన్‌ విరోధి-నరేంద్ర మోదీ’ అని, విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో విఫలమయ్యారని, బ్యాంకులను లూటీ చేస్తోన్న, కుంభకోణాలకు పాల్పడుతోన్న బడా మోసగాళ్ళను కాపాడుతున్నదని, పేపర్‌ లీక్‌ సర్కార్‌ అని, ఆలోచనలేని విదేశీవిధానాన్ని అనుసరిస్తున్నారని, దళితులు, మైనారిటీలపై దాడులకు తెగబడుతూ దేశాన్ని రాతియుగంవైపునకు నడిపిస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్‌ మండిపడింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ నాలుగేళ్ళ మోదీ ప్రభుత్వ ప్రొగ్రెస్‌కు మార్కులు వేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది. వ్యవసాయం, విదేశీ విధానం, చమురు ధరలు, ఉద్యోగాల కల్పన సబ్జెక్టుల్లో మోదీ ఫెయిల్‌ అయ్యారని, అదే నినాదాలు ఇవ్వడంలోగానీ, సొంతడబ్బ కొట్టుకోవడంలోగానీ ఏప్లస్‌ ర్యాంకును, యోగాలో మైనస్‌ బి ర్యాంకును సాధించారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. చివరిగా.. మోదీ మాస్టర్‌ కమ్యూనికేటర్‌ అని, పలురకాల న్యూనతలతో బాధపడుతూఉంటారని, శ్రద్ధలేనివారని రిమార్క్‌ రాసుకొచ్చారు రాహుల్‌ గాంధీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement