2019 ప్రధాని అభ్యర్థి రాహుల్‌ | Rahul Gandhi chairs his maiden Congress Working Committee meeting | Sakshi
Sakshi News home page

2019 ప్రధాని అభ్యర్థి రాహుల్‌

Published Mon, Jul 23 2018 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Rahul Gandhi chairs his maiden Congress Working Committee meeting - Sakshi

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియా, రాహుల్, మన్మోహన్, అజాద్‌

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకుంది. విపక్షపార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ తమ పార్టీ తరపున రాహులే ప్రధాని అభ్యర్థని స్పష్టం చేసింది. దీంతోపాటుగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు నిర్ణయించే విషయంలో సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కే కట్టబెడుతూ ఆదివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా సీడబ్ల్యూసీనుద్దేశించి రాహుల్‌ ఆదివారం ప్రసంగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశంలోని పీడిత, బాధిత జనాలకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తిగా నవీకరించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) పార్టీలోని గత, ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు వారధిగా నిలవాలన్నారు. అనుభవంతోపాటు పరిగెత్తే శక్తి ఉన్న గొప్ప నాయకుల పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. కొత్త సీడబ్ల్యూసీ కూడా ఇలాంటి స్ఫూర్తితోనే దూసుకెళ్లాలన్నా రు. బీజేపీ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదలపై దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
రాఫెల్‌ రహస్య నిబంధనపై..
ఫ్రాన్స్‌తో కుదిరిన వివాదాస్పద రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం జరిగిందని రాహుల్‌ ఆరోపించారు.  ‘రాఫెల్‌ ఒప్పందంలోని రహస్య నిబంధన విషయంలో రక్షణమంత్రి తీరు అనుమానాస్పదంగా ఉంది. ఒకసారి అది రహస్యమని మరోసారి ఇందులో రహస్యమేదీ లేదని ఆమె చెబుతున్నారు. రాఫెల్‌ ధర ఎంతని అడిగితే.. ప్రధాని తటపటాయిస్తున్నారు. నా కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేకున్నారు. ఇదంతా చూస్తుంటే భారీ కుంభకోణమే జరిగినట్లనిపిస్తోంది’ అని రాహుల్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు.    ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా దేశంలో పాలన సాగుతోందని సోనియా ఘాటైన విమర్శలు చేశారు. సమాజంలో విభేదాలు, భయాందోళనలు సృష్టించేలా మోదీ పాలన సాగుతోందన్నారు. ఈ పోరాటంలో రాహుల్‌కు మద్దతుగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

రాహుల్‌ నాయకత్వం వహించాలి
ఆదివారం నాటి సమావేశంలో మాట్లాడిన 40–50 మంది నేతలంతా.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు అవసరమని నొక్కిచెప్పారు. మరికొందరైతే.. ఈ కూటమికి రాహుల్‌ గాంధీయే నాయకత్వం వహించాలని కోరారు. దేశంలో విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్‌ పిలుపునిచ్చారని సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లో 42 సీట్లు గెలుస్తామన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను తుది నిర్ణయంగా భావించనక్కర్లేదన్నారు. రాహుల్‌ నేతృత్వంలోనే కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని సుర్జేవాలా స్పష్టం చేశారు. దేశంలో సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధి పునరుద్ధరణకు దుర్భర ప్రయత్నం చేస్తున్న రాహుల్‌కు కాంగ్రెస్‌ సీనియర్లంతా అండగా నిలుస్తామని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. గొప్పలు చెప్పుకోవడం, గిమ్మిక్కులు చేసే సంస్కృతికి వ్యతిరేకంగా ఓ బలమైన విధివిధానంతో దేశాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలు రాహుల్‌ను ఆదరించరు: బీజేపీ
పార్లమెంటులో ప్రధానిని హత్తుకున్న రాహుల్‌పై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. రాహుల్‌ మోదీని ఆలింగనం చేసుకున్నా ప్రజలు మాత్రం రాహుల్‌ను ఆదరించబోరని విమర్శించింది. సీడబ్ల్యూసీ భేటీని, రాహుల్‌ను ‘కాంగ్రెస్‌ పనిచేయని కమిటీకి.. పనిచేయని చీఫ్‌’గా, ఒక కుటుంబాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ దర్బార్‌గా బీజేపీ నేత సంబిత్‌ పాత్రా అభివర్ణించారు. దేశం వెనుకబడుతోందన్న సోనియా వ్యాఖ్యలపై తిప్పికొడుతూ.. ‘మీ పాలనలో 10ఏళ్ల పాటు దేశం రివర్స్‌ గేర్‌లోనే ఉంది. ఇప్పుడు మేం రివర్స్‌ గేర్‌ వేశాం’ అని పేర్కొన్నారు. ‘నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని అడిగినట్లు తెలిసింది. వీటితోనే ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన మంత్రి కావాలని వాళ్ల కోరిక’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement