సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
సాక్షి, శంషాబాద్ : ‘ప్రజాఫ్రంట్ గెలుపుతో మీ ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా చేతకాని హామీలు ఇచ్చి మోసం చేయడం నాకు అలవాటులేదు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్రధారులైన మీ కో ర్కెలు సమంజసమైనవే’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రైవేటు విద్యా సంస్థలకు భరోసా ఇచ్చారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా విద్యాసంస్థల పరిరక్షణ సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యావేత్తలు, నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైంది కాద న్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాయడం మో దీకి, కేసీఆర్‌కు అలవాటేనన్నారు. ప్రజాఫ్రంట్ రాగా నే బకాయిలున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఆరోగ్య కార్డులు, బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యా సంస్థలకు విద్యుత్, ఆస్తిపన్ను బిల్లులు కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తానెప్పుడు కూడా అడ్డగోలుగా హామీలు ఇవ్వలేదని, ఇ చ్చిన హామీలకు మాత్రం కట్టుబడి ఉంటానని రాహు ల్ చెప్పారు. కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పక్కాగా అమలవుతున్నాయన్నారు.
మీ మద్దతుతో కేసీఆర్‌లో వణుకు: ఉత్తమ్
తెలంగాణ సమాజానికి విద్యాసంస్థల సేవలు ఎనలేనివని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో భాగస్వాములుగా మిమ్మల్ని చూస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ప్రజాఫ్రంట్‌కు మద్దతు పలకడంతో కేసీఆర్‌లో వణుకు మొదలైందన్నారు. నాలుగున్నరేళ్లుగా మిమ్మల్ని పట్టించుకోకుండా అవమానించిన కేసీఆర్ ప్రభుత్వానికి గోరీ కట్టాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు మద్దతు పలికే కేసీఆర్‌ను ఓటుతో శిక్షించాలన్నారు. ప్రజాఫ్రంట్ అధికారంలోకి రాగానే రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామన్నారు.
నిరంకుశంగా వ్యవహరించింది: కోదండరాం
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విద్యాసంస్థల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని టీజేఏస్ అధినేత కోదండరాం అన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ విద్యాసంస్థల్లో పనిచేసే వారు అవమాన భారాన్ని మోసారన్నారు. ప్రభుత్వం తీరుతో 900 డిగ్రీ కళాశాలలు, 1,900 జూనియర్ కళాశాలలు, 2,500 పాఠశాలలు మూతపడి వేలాది మంది ఉపాధి కోల్పోయారన్నారు. ప్రజాఫ్రంట్ రాకతో విద్యా సంస్థల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. విద్యాసంస్థలు కోరుతున్న ఆమోదయోగ్య డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విద్యాప్రమాణాలు పడిపోవడంతో పాటు నిరుపేదలకు విద్య దూరమవుతుందన్నారు. సర్కారు స్కూళ్లను నడపడం చేతకాక ఈ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై పడిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
మా మద్దతు ప్రజాఫ్రంట్‌కే..
అంతకుముందు కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ రమణారెడ్డి, కన్వీనర్ గౌరీసతీశ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి, టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాఫ్రంట్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తమపైనే కేసీఆర్ కక్షగట్టి ఉద్యమ ద్రోహులైన కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, సభ్యులు వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment