మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ | Rahul Gandhi Speech At Shamshabad Public Meeting | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ

Published Sun, Mar 10 2019 12:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul Gandhi Speech At Shamshabad Public Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ఉందని.. అందుకే మోదీ ఏం చేసినా కేసీఆర్‌ మద్దతిస్తారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతి చిట్టా మోదీ వద్ద ఉందని అందుకే వీరిద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నారన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ విషయంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులు బీజేపీకి మద్దతిచ్చిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని రాహుల్‌ అన్నారు. శనివారం శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ‘కనీస ఆదాయ వాగ్దాన సభ’కు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్‌ భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బ్రిటీష్‌ వారినుంచి దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చిన కాంగ్రెస్‌ పార్టీదే అసలైన దేశభక్తి అని ఆయన అన్నారు. ఇప్పుడు దేశభక్తులుగా చెప్పుకుంటున్నవారు ప్రజలకు ప్రేమను పంచకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటే పరోక్షంగా మోదీపై విమర్శలు చేశారు. మోదీ కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని, ఆయన 15–20 మంది కార్పొరేట్ల పక్షాన ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని పేదల పక్షాన ఉంటుందన్నారు. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే పేదలను వెతికి పట్టుకుని మరీ.. వారి బ్యాంక్‌ అకౌంట్లలో కనీస ఆదాయ పథకం కింద డబ్బులు నేరుగా వేస్తామని చెప్పారు. 
 
దేశాన్ని విభజించేలా! 
గత ఐదేళ్లుగా ప్రధాని మోదీ దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలని చూస్తున్నారు. ధనిక, పేద భారతదేశాలుగా విడిపోయేలా పాలిస్తున్నారు. పెద్ద పెద్ద విమానాల్లో తిరిగేవారికి అండగా నిలుస్తున్నారు. రూ.3.5లక్షల కోట్లను పెట్టుబడి దారులకు రుణమాఫీ కింద ఇచ్చారు. కార్పొరేట్లకు అండగా ఉండి ధనిక భారతదేశాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు పేద రైతులు చేతులు జోడించి రుణమాఫీ చేయాలని కోరినా.. అది మా ప్రభుత్వం విధానం కాదంటున్నారు. రెండున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని మోదీ మాట తప్పారు. అయినా లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలంతా మోదీకే మద్దతిచ్చారు. నోట్లరద్దు మంచిదని కేసీఆర్‌ అంటారు. జీఎస్టీని సమర్థిస్తారు. మోదీ ఏం చేయాలనుకున్నా కేసీఆర్‌ మద్దతిస్తారు. వేలాది కోట్ల రూపాయల రఫేల్‌ కుంభకోణంలో కేసీఆర్‌ మోదీని ఎన్నిసార్లు ప్రశ్నించారు? ఎప్పుడైనా ఆ రూ.30వేల కోట్ల గురించి అడిగారా? కనీసం విచారణ జరపాలని అడిగారా? మోదీ ప్రధానిగా కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్‌ అవినీతి చిట్టా మోదీ చేతిలో ఉంది. మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ఉంది. 
 
‘కనీస ఆదాయపథకం’చారిత్రకం 
దేశంలో శ్వేత, హరితవిప్లవాలను సృష్టించింది కాంగ్రెస్‌ పార్టీయే. బ్యాంకుల జాతీయీకరణలాంటి ఎన్నో చారిత్రక కార్యక్రమాలను చేపట్టింది. మళ్లీ 2019లో కూడా ఓ చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి కనీస ఆదాయం వచ్చే పథకాన్ని అమలు చేయలదలిచాం. 2019 ఎన్నికల తర్వాత ఏర్పడే భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి తీరుతుంది. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబం బ్యాంక్‌ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు వేస్తాం. మేం నిర్ధారించిన ఆదాయాని కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారిని వెతికి వెతికి మరీ డబ్బులు వేస్తాం.  
 
హామీలు అమలు చేశాం 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. ఇచ్చిన విధంగానే ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో అమలు చేశాం. ఛత్తీస్‌గఢ్‌లో వరికి క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర ఇస్తున్నాం. బస్తర్‌లోని ఆదివాసీల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూములు వారికిచ్చేశాం. పరిశ్రమలకోసం రైతులు, పేదల నుంచి తీసుకున్న భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిందే. లేదంటే ఆ భూములను తిరిగి వారికి ఇచ్చేయాలి. భూసేకరణ పరిహారం రైతులకు లభించాలి. చిన్నవ్యాపారులు లేనిదే దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. జీఎస్టీ, నోట్లరద్దు పేరుతో దేశ ఆర్థికవ్యవస్థ వెన్ను విరిచారు. 
 
ఎవరూ భయపడొద్దు 
తెలంగాణతో పాటు దేశంలోని ప్రజలెవరూ భయపడొద్దు. మీరు దేశంలోని అందరికీ అన్నం పెడుతున్నారు. మేం మీతో ఉన్నాం. నేనవరి భూములు గుంజుకోనివ్వను. ఎవరి డబ్బులూ తీసుకోనివ్వను. ప్రజలకు ఎక్కడ అవసరమైతే.. అక్కడ అండగా నిలుస్తా. యూపీలో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళపై అత్యాచారం చేస్తే.. ఎలాంటి విచారణ జరగలేదు. ఆ సంఘటనపై మోదీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దేశంలో మహిళలు స్వేచ్ఛగా బయటకొచ్చే పరిస్థితి లేదు. మేం అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమల్లోకి తెస్తాం. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి తీరతాం. మహిళలపై ఈగవాలినా నేను సహించను. 
 
ఇదేనా మీ దేశభక్తి! 
చైనా సైన్యం డోక్లాంలోకి వచ్చి కవ్విస్తుంటే.. చైనా అధ్యక్షుడితో మోదీ గుజరాత్‌లో ఊయలలూగుతారా? సైనికుల ప్రాణాలు పోతుంటే మూడున్నరగంటల పాటు మోదీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారా? నరేంద్రమోదీ, బీజేపీ దేశభక్తి ఇదేనా. కాంగ్రెస్‌ పార్టీ ఇంగ్లీషు వారిని తరమికొట్టింది కాంగ్రెస్‌ పార్టీయే. ఇద్దరు ప్రధానులను దేశం కోసం పోగొట్టుకున్న పార్టీ మాది. మాది నిజమైన దేశభక్తి. మోదీని గద్దెదించే సమయం ఆసన్నమైంది. మోదీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల గొంతుకను అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని కాపాడుతుంది. ప్రజల గొంతుకవుతుంది.. అని రాహుల్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 
హాజరైన పీసీసీ ప్రముఖులు 
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, అజారుద్దీన్, సీనియర్‌ నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వెంకటరెడ్డి, షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, నంది ఎల్లయ్య, డీకే అరుణ, కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, చిన్నారెడ్డి, సంపత్, వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పటోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
వారికి ఓటేస్తే మోరీలో వేసినట్టే: ఉత్తమ్‌ 
రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 16 మంది ఎంపీలుండి కూడా టీఆర్‌ఎస్‌ ఐదేళ్లలో సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కోచ్‌ఫ్యాక్టరీతో పాటు ఇతర విభజన హామీలను అమలు చేయించడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. మోదీ మైనార్టీలను మోసం చేశారని, రైతులు, యువతతో పాటు అన్ని వర్గాలను విస్మరించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. 
 
ఆ ఓటు మోదీకి పోయినట్లే: భట్టి 
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సమాజం కోసం తపించే రాహుల్‌ ఒకవైపు, సమాజాన్ని విడగొట్టి పాలించాలనుకుంటున్న మోదీ ఒకవైపు.. ఈ ఎన్నికల్లో తలపడుతున్నారన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు వేసే ప్రతి ఓటును మోదీకి వేసినట్టేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. 
 
కోటు.. ఓటు.. నోటు: విజయశాంతి 
అసెంబ్లీ యుద్ధం ముగిసి లోక్‌సభ యుద్ధం మొదలైందని పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి అన్నారు. మనసు లేని మోదీ, మనసున్న రాహుల్‌ల మధ్య ఈ యుద్ధం జరుగుతోందన్నారు. ‘మోదీ వేసేది పదిలక్షల కోటు.. అడిగేది ఓటు.. ఆయనకు కావాల్సింది బ్యాంకుల్లో నోటు’అని ఆమె ఎద్దేవా చేశారు. 
 
ఎంతకు కొన్నారో చెప్పండి: రాజగోపాల్‌రెడ్డి 
కేసీఆర్‌ నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకున్నామని, ఎంపీటీసీగా, జడ్పీటీసీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు. అయినా పార్టీకి ద్రోహం చేసిన లింగయ్య.. టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారని అన్నారు. లింగయ్యను ఎన్నికోట్లకు కొనుగోలు చేశారో కేసీఆర్‌ చెప్పాలని రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  
 
చేవెళ్ల కోసం ఎవరితోనైనా: కొండా 
చేవెళ్ల అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించిన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని.. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ఆయన చెప్పారు.  
 
రేవంత్‌ డుమ్మా! 
రాహుల్‌ గాంధీ సభకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. కారణాలు ఏమయినప్పటికీ ఆయన సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమయింది. టీఆర్‌ఎస్‌లోకి మారనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు (ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య) మినహా కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ నంది ఎల్లయ్యలతో పాటు ఇతర ముఖ్య నేతలంతా సభకు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement