
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో.. తెలంగాణలో ముస్లిం ఓట్లు ప్రభావవంతంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. ఈ నెల 20న హైదరాబాద్‌లోని పాతబస్తీతోపాటు ఆదిలాబాద్ జిల్లా భైంసా, కామారెడ్డిల్లో సభలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసింది. మొదట బోథ్, కామారెడ్డిల్లో 20వ తేదీన సభలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఆదివారం పార్టీ ముఖ్యనేతల భేటీలో ఈ వ్యూహం సిద్ధం చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. 20న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ చేరుకున్న తర్వాత.. రాహుల్ నేరుగా పాతబస్తీకి వెళతారు. అక్కడ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ‘రాజీవ్ గాంధీ సద్భావన దివస్’సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. భోజన విరామం తర్వాత 1:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ జిల్లా భైంసా చేరుకుంటారు. అక్కడ బహిరంగసభ పూర్తయిన తర్వాత.. హెలికాప్టర్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ మరో బహిరంగసభలో రాహుల్ పాల్గొంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుని.. రాత్రికి ఢిల్లీ వెళ్తారు. కాగా, భైంసా, కామారెడ్డిల్లో రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సోమవారం ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment