
సాక్షి,అమేథి: కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడి రైతుల నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ తీసుకున్న భూమిని తిరిగి వారికి అప్పగించలేదని ఆమె ఆరోపించారు.అమేథి నియోజకవర్గంలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో కలిసి బహిరంగసభలో ప్రసంగించారు. రైతు సంక్షేమం గురించి నిత్యం మాట్లాడే రాహుల్ ఇక్కడి రైతుల నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తీసుకున్న భూములను ఇంతవరకూ వారికి తిరిగి ఇవ్వలేదని అన్నారు. అమేథి ప్రజలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్‌గానే పరిగణిస్తుందని విమర్శించారు. అమేథిలో కలెక్టర్ కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు.
అమేథి ఎంపీ రాహుల్ గాంధీ దేశంలో అభివృద్ధిపై విదేశీ వేదికలపైనా ప్రసంగిస్తారు కానీ తన నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోరని ఆరోపించారు. 2019లో అమేథి పార్లమెంట్ స్దానంలో బీజేపీ గెలుపొందుతుందని స్మృతీ ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. ఇక రైతుల నుంచి సేకరించిన భూమిలో రాహుల్ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకపోవడంతో ఆ భూములను వారికి తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
సామ్రాట్ సైకిల్ పేరుతో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రైతుల నుంచి దాదాపు 65 ఎకరాలను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సేకరించింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో రైతుల భూములను తిరిగి వారికి అప్పగించాలని స్మృతీ ఇరానీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.