సాక్షి, న్యూఢిల్లీ : గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోపు పగ్గాలు అప్పజెప్పటం చేయటం ఖాయమనే సంకేతాలు ఏఐసీసీ ఇప్పటికే అందించింది కూడా. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైన పార్టీని తిరిగి నిలబెట్టే అంశంలో రాహుల్ ఏమేర విజయం సాధిస్తాడనేది ఇప్పుడప్పుడే తేల్చలేని అంశం. అయితే పగ్గాలు చేపట్టిన వెంటనే రాహుల్ తక్షణ కర్తవ్యం వర్గపోరును పరిష్కరించటమేనని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఏ పార్టీలో లేనంతగా కాంగ్రెస్ లో కురువృద్ధుల హవా కొనసాగుతోంది. అదే సమయంలో యువ నేతలు రాహుల్‌కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్లు తమను పట్టించుకోకపోవటంపై సీనియర్లు గుర్రుతో ఉన్నారు. రాహుల్ ఖచ్ఛితంగా సీనియర్ల సలహాలు తీసుకోవాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేయటంతో.. మున్ముందు కూడా తమ డామినేషన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. కానీ, రాహుల్ మాత్రం అందుకు సుముఖంగా లేడన్నది ఆయన కదలికలను బట్టి అర్థమౌతోంది.
మధ్యప్రదేశ్ విషయానికొస్తే... రాబోయే ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా పేరు పార్టీ పరిశీలనలో ఉంది. అయితే మరో సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మాత్రం కమల్ నాథ్ పేరును సూచిస్తున్నారు. సీఎం అభ్యర్థి విషయంలో హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని కమల్‌నాథ్ పైకి చెబుతున్నప్పటికీ... అంతర్గతంగా డిగ్గీరాజా-కమల్‌లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనేది టాక్. రాజస్థాన్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఆయన మద్దతుదారులు విజ్ఞప్తి చేస్తుండగా.. యువ నేత సచిన్ పైలెట్‌ను ప్రకటించే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా సచిన్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉంటూ మంచి మార్కులు సంపాదించుకున్నారు. కానీ, గెహ్లట్ మాస్ అప్పీల్ ముందు సచిన్ పనికిరాడంటూ కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానించటం విశేషం.
ఢిల్లీ విషయానికొస్తే.. షీలా దీక్షిత్ తర్వాత అజయ్ మాకెన్ పేరు తెర మీదకు వచ్చింది. కానీ, మాకెన్ నేతృత్వంలో హస్తినలో పార్టీ ఎంత దారుణంగా పతనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని పార్టీ శ్రేణుల వాదన. మున్సిపల్ ఎన్నికలతోసహా ప్రతీదాంట్లోనూ ఆయన నాయకత్వాన్ని ప్రజలు దారుణంగా తిరస్కరించారు. దీంతో అక్కడ కొత్త రక్తం అవసరమన్న భావన అక్కడి నేతల్లో తలెత్తుతోంది.
త్వరలో ఎన్నికలు జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ పార్టీని వీడాక గుజరాత్‌లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఆయన నిష్క్రమణ నష్టం కాదని పార్టీ అనుకోవటం మూర్ఖత్వమేనని సీనియర్ నేతలు చెబుతున్నారు. పటీదార్ ఉద్యమం నేపథ్యంలో యువ నేతల అండ ద్వారా పార్టీ పుంజుకుంటుందన్న నమ్మకం తమకు ఇసుమంతైనా లేదని వారంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ విషయానికొస్తే... అవినీతి ఆరోపణలతో విమర్శల పాలవుతున్న వీర్‌భద్ర సింగ్ తనను తాను సీఎం అభ్యర్థిగా చూపించుకునే యత్నం చేస్తున్నారు. అయితే రాహుల్ మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుకూను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. కానీ, పార్టీ మళ్లీ గెలుపు సాధించాలంటే మాత్రం బలమైన అభ్యర్థిని వెతుక్కోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు రాహుల్‌ను కోరుతున్నాయి.
మరి పెద్దల విషయంలో రాహుల్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఏఐసీసీ వర్గీయులను.. ముఖ్యంగా అధినేత్రి సోనియా గాంధీని కొత్త రాజు ఎలా సముదాయిస్తాడు? అన్నది మున్ముందు చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment