జైపూర్/ఢిల్లీ: రసవత్తరంగా సాగుతున్న రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల వ్యవహారం మరింత కాకపుట్టించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్‌ఓజీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని రాజస్తాన్ బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్ అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీఫ్ విప్ మహేష్ జోషి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, రాజస్తాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్, సీఎం వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న లోకేష్ శర్మలను భరద్వాజ్ ఫిర్యాదులో నిందితులలుగా పేర్కొన్నారు. ఫేక్ ఆడియో కాల్స్ సృష్టించి బీజేపీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 8 సివిల్ లైన్స్‌లోని సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో ఓఎస్డీ లోకేష్ శర్మ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగుతున్నాయని ఆరోపించారు.
(చదవండి: ‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’)
నిందితులపై చర్యలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని భరద్వాజ్ కోరారు. కాగా, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆడియో టేపుల సంభాషణలు శుక్రవారం చదివి వినిపించారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారని ఆరోపించారు. దాంతోపాటు ‘రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్న ప్రధాని మోదీ.. ఈ సారి సరైన రాష్ట్రాన్ని ఎంచుకోలేదు’అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
(రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా)
Comments
Please login to add a commentAdd a comment