సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటు ఎగువ సభగా పేర్కొనే రాజ్యసభలో 245 మంది సభ్యులకు గాను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య 73 మంది సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని రిటైర్ అవుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ముగియనుంది. రాష్ట్రం నుంచి రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీపీ రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎన్నికై ప్రస్తుతం బీజేపీలో ఉన్న గరికపాటి మోహన్‌రావు ఉన్నారు. రాష్ట్ర పునర్వి భజన సందర్భంగా ఏపీ కోటాకు కేటాయించిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు కూడా ఏప్రిల్ 2న రాజ్యసభ సభ్యత్వం నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో గరికపాటి మోహన్‌రావు, కేవీపీ రామచంద్రరావు స్థానంలో... తెలంగాణ శాసనసభ్యులు ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల చివరన లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. నిబంధనల ప్రకారం సభ్యుల పదవీ కాలం ముగియడానికి 50 రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.
రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు
రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి ఆరుగురు సభ్యులున్నారు. వీరిలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే రిటైర్ అవుతున్నారు. రాష్ట్ర శాసనసభ్యులు పరోక్ష ఓటింగ్ ద్వారా రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనుండగా, అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు ఉన్న సంఖ్యా బలం పరంగా చూస్తే 2 స్థానాలు ఆ పార్టీకే దక్కే సూచనలున్నాయి. 119 మంది శాసనభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 104, ఎఐఎంఐఎంకు 7, కాంగ్రెస్‌కు 6, టీడీపీ, బీజేపీకి ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. 2018 మార్చిలో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్ల కోసం జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పి.బలరాంనాయక్‌ను బరిలోకి దించినా, ఎంఐఎం మద్దతుతో టీఆర్‌ఎస్ మూడు స్థానాల్లోనూ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటంతో ద్వైవార్షిక ఎన్నికలు జరిగే రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశముంది. దీంతో ద్వైవార్షిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని 7 రాజ్యసభ స్థానాలు టీఆర్‌ఎస్ పరమయ్యే అవకాశం ఉంది.
ఆశావహుల జాబితాలో పలువురు నేతలు
త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అవకాశం కోసం పలువురు టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రిటైరవుతున్న పార్టీ పార్లమెంటరీ నేత కేకే మరోమారు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి చెందిన మాజీ ఎంపీ కవిత పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. వీరితో పాటు గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారాంనాయక్‌తో పాటు ఇతరులు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్నా అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు లేకపోవడంతో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన వారి పేర్లను పరిశీలనకు తీసుకోకపోవచ్చనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
త్వరలో రాజ్యసభ ‘ద్వైవార్షిక’ నోటిఫికేషన్
Published Fri, Feb 21 2020 3:23 AM | Last Updated on Fri, Feb 21 2020 3:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment