ఉల్లి ధరలు పెరిగిపోయి ప్రభుత్వాలు పడిపోయిన ఘటనల్ని చూశాం. వెల్లుల్లి రైతుల దీనావస్థ ఎన్నికల్లో ప్రచారం అంశంగా మారడమూ చూశాం. ఈసారి ఎన్నికల్లో ఆ పాత్ర బంగాళదుంప పోషిస్తుందా? కేజీ ఆలూకి మార్కెట్‌లో మూడు, నాలుగు రూపాయలు కూడా రాకపోతే రైతులు ఎలా బతుకుతారు? చెమటోడ్చి పండించిన పంట అమ్ముడుపోకుండా కళ్లెదుటే కుళ్లిపోతుంటే ఆ రైతన్నల గుండెలు పగిలి పోతున్నాయి. ఉత్తరప్రదేశ్ రైతులు ఈ ఎన్నికల్లో బీజేపీ దుంప తెంచుతారా? వారిలో నెలకొన్న అసమ్మతి జ్వాలలు కమలనాథుల్ని ఎంతవరకు తాకుతాయి?..
ఉత్తరప్రదేశ్‌లో బంగాళదుంపల ఉత్పత్తి భారత్‌లో జరిగే ఉత్పత్తిలో 30 శాతానికి పైగా ఉంటుంది. కానీ మూడేళ్లుగా దుంపల ధరలు రోజు రోజుకీ పడిపోవడంతో రైతన్నలు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆగ్రా, హాత్రస్, మ«థుర, అలీగఢ్ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్న పలు లోక్‌సభ నియోజకవర్గాలు ప్రస్తుతం కమలనాథుల చేతుల్లోనే ఉన్నాయి. బీజేపీ నేతలే ఎంపీలుగా ఉన్నారు. దీంతో రైతుల ఆగ్రహ జ్వాలలు వారినెక్కడ తాకుతాయోనన్న ఆందోళన ఉంది. ‘గత ఐదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం బంగాళదుంపలు సాగు చేస్తున్న రైతులకి ఏమీ చేయడం లేదు. వారికెందుకు ఓటు వెయ్యాలి’ అని ప్రధానమంత్రికి మనీయార్డర్ పంపించిన ప్రదీప్ శర్మ ప్రశ్నిస్తున్నారు. ఆగ్రా జిల్లా బరౌలీ అహీర్‌కి చెందిన ఈ రైతు నాలుగేళ్లలోనే రూ.35 లక్షలు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ‘ఆలూ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద నోట్ల రద్దు అనేది పంటలకు పట్టిన చీడలాంటిది. అప్పట్నుంచే ధరలు పాతాళానికి పడిపోయాయి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధరలు ఎలా పడిపోయాయంటే..
కేజీ బంగాళదుంప పండించాలంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? సగటున రూ.8. అదే మార్కెట్‌లో అమ్ముకుంటే వాళ్లకి కేజీకి మూడు, నాలుగు రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే పెట్టుబడి వ్యయంలో సగానికి సగం అన్నమాట. అంత నష్టాన్ని ఏ రైతు భరించగలడు? హాత్రస్ జిల్లాలో విజయ శర్మ అనే రైతుకి ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సీజన్‌లో 8 వేల కిలోల బంగాళదుంపలు పండాయి. తన పంట పండిందనే అనుకున్నాడు. తీరా మండీకి తీసుకెళ్తే కిలోకి నాలుగు రూపాయలు మించి రాలేదు. అంతేకాదు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచడానికి కేజీకి రెండున్నర రూపాయలు వసూలు చేస్తారు. వాటి రవాణాకి తడిసి మోపెడు ఖర్చు అవుతుంది. ‘సాధారణంగా మే, జూన్‌లో ఆలూ ధరలు పెరుగుతాయి. కానీ గత మూడు సీజన్‌లుగా వేసవిలో కూడా తక్కువ ధరకే పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది’ అని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెద్ద నోట్ల రద్దు రైతు నడ్డి విరిచేసింది. రద్దు తర్వాత కేజీ రూపాయికి అమ్ముకున్న రోజులూ ఉన్నాయి. అంతకు ముందు కేజీ 11 రూపాయలకి అమ్మాను’ అంటూ శర్మ కన్నీరుమున్నీరయ్యారు.
బీజేపీకి రైతుల సెగ తగులుతుందా?
కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో సహజంగానే రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగానే నెలకొంది. ‘మోదీ చరిష్మా కలిగిన నాయకుడే. సందేహం లేదు. కానీ మా సమస్యలు కూడా పట్టించుకోవాలి కదా. అలాగని ప్రత్యామ్నాయ పార్టీలు సరిగా లేవు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదో తెలీదు. ప్రాంతీయ పార్టీలపై మాకు నమ్మకం లేదు. ఉన్నంతలో ఆర్‌ఎల్‌డీ కాస్త నయం’ అని రాజేశ్ చౌధరీ అనే రైతు అభిప్రాయం. ఆలూ ఎగుమతి విషయంలో కేంద్రం ధరల్ని నియంత్రించడం వల్లే క్వింటాళ్ల కొద్దీ దుంపలు స్థానిక మార్కెట్లలోనే ఉండిపోయాయి. దీంతో ధరలు పడిపోయాయి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ క్వింటాలుకు రూ.487కి ఆలూ కొనుగోలు చేస్తామని చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీపై పలువురు రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ ప్రత్నామ్నాయంగా సరైన పార్టీ కనిపించకపోవడంతో ఎన్నికల్లో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది.
916 - 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుకి ముందు ఆగ్రా, మథుర, హాత్రస్ మండీలలో క్వింటాలు ఆలూకు పలికిన ధర
532 - 2016 డిసెంబర్‌లో ఆ మూడు మండీలలో ధర 41.8% పడిపోయింది. వంద కేజీలకు రూ.532 మాత్రమే రైతులకి వచ్చాయి
Comments
Please login to add a commentAdd a comment