సీఎన్‌ఎన్ న్యూస్ 18లో చానెల్‌లో పాటపై కథనం
అత్యధిక కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నాయకుడెవరు?
ఎవరి ప్రచార సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు?
యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన ప్రచార వీడియో ఎవరివి?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది..
ప్రచార ఆర్భాటం లేదు..
రాజకీయ నాటకీయత లేదు..
ఉన్నదంతా జనమే స్వచ్ఛందంగా
తమ నాయకుడికి స్వాగతం పలకడం.
ఆ నాయకుడు జనమే సర్వస్వం అనుకుంటూ ముందుకు సాగడం.
అందుకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వీడియో గీతం రాష్ట్ర ప్రజానీకం మనసులను ఆవిష్కరించింది. అందుకే అంతటి ప్రజాదరణ పొందింది.
ప్రజాదరణకు కొలబద్ధలైన అన్ని రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టిస్తున్న నవతరం నాయకుడు ఎవరంటే వినిపించే ఒకే ఒక్క పేరు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తిరుగులేని ప్రజాదరణతో జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారారు. ఇప్పటికే.. రాజకీయ యవనికపై విప్లవం తీసుకువచ్చిన ఆయన సామాజిక మాధ్యమాల్లోనూ జాతీయ స్థాయి రికార్డులు సృష్టిస్తూ అగ్రభాగంలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న ఎన్నికల ప్రచార వీడియో ‘రావాలి జగన్.. కావాలి జగన్’. వైఎస్సార్‌సీపీ రూపొందించిన ఈ వీడియో ఏకంగా కోటి వీక్షణలతో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, జగన్ వైపు అబ్బురంగా చూస్తోంది. ఒక పార్టీ ప్రచార గీతం.. అందులోనూ ఓ ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం.. జాతీయ పార్టీల ప్రచార గీతాలను వెనక్కినెట్టి మరీ రికార్డు స్థాయి వ్యూవర్స్‌ను ఆకర్షించడమే దీనంతటికీ కారణం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రూపొందించిన ప్రచార గీతం ‘సబ్ కో స్వాగత్ తయ్యార్ హై’ వీడియో 47 లక్షల వ్యూస్‌తో ఇంతవరకు అగ్రస్థానంలో కొనసాగింది. ఆ రికార్డులను బద్దలు కొడుతూ ‘రావాలి జగన్.. కావాలి జగన్’ వీడియోకు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయి. ఇంతగా ఆదరణ పొందిన ఆ పాటలో ఏముందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ ఏముంది..
రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుంది. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలున్నాయి. పేదల గుండె మంట ఉంది. తమను ఆదుకోవడానికి జగన్ రావాలి... తమకు జగనే కావాలి అనే జనాభిప్రాయం ఉంది. రాష్ట్ర ప్రజల ఆర్తిని, ఆకాంక్షలను అక్షరీకరిస్తూ ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ దీనిని రచించారు. యావత్ ప్రజల మనోభీష్టానికి పాట రూపమిచ్చారు. ఇక ‘ఫిదా’ సినిమాతో జానపద బాణీలతో అలరించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మరోసారి జనం మనసులను తడిమే, గుండెను తాకే స్వరాలను సమకూర్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రముఖ గాయకుడు మనో.. మనసు లోతుల నుంచి ఉద్విగ్నభరితంగా ఆలపించారు. ఇలా ప్రజా హృదయ స్పందనను ఆవిష్కరిస్తూ రచించి స్వరాలు సమకూర్చిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ గీతాన్ని అందుకు తగ్గట్టుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దృశ్యాలతో మేళవించి చక్కని వీడియో గీతంగా విడుదల చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రతిబింబిస్తూ.. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను వివరిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండే జగన్‌లోని మానవీయ కోణాన్ని స్పృశిస్తూ వీడియో గీతం వాస్తవానికి అద్దం పడుతోంది.
వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతం
ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. దీన్నిబట్టి రాష్ట్ర యువతలో వైఎస్ జగన్‌పై వెల్లువెత్తుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనంగా భావించాలి. కొత్త తరం తమ భవిష్యత్ తీర్చిదిద్దే నాయకుడిగా వైఎస్ జగన్‌ను గుర్తించింది. అందులోనూ రాష్ట్రంలో 2014 తర్వాత కొత్తగా నమోదైన ఓటర్లు దాదాపు 30 లక్షల మంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వీడియో గీతంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థి, ఉద్యోగులు, సామాన్యులు.. ఇలా అన్నివర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment