సాక్షి, అమరావతి: నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వానికీ.. పోలవరం ప్రాజెక్టుకూ రాయపాటి సాంబశివరావు ముడిపెట్టారు. తనకు లేదా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వని పక్షంలో పోలవరం ప్రాజెక్టులో ముడుపుల బాగోతాన్ని పూసగుచ్చినట్లు ప్రజలకు చెబుతానని సీఎం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రాయపాటి బెదిరింపులతో వెనక్కితగ్గిన చంద్రబాబు నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిత్వంపై సిట్టింగ్ ఎంపీ రాయపాటికి స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. రాయపాటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట టీడీపీ టికెట్ తనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ (జేవీ) రూ.4,054 కోట్లకు మార్చి 3, 2013న దక్కించుకుంది. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఏమాత్రం అనుభవం లేని ట్రాన్స్‌ట్రాయ్‌కు పోలవరం పనులు ఎలా అప్పగిస్తారని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి భారీగా కమీషన్లు ముట్టాయని కూడా ఆరోపించారు. అయితే 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి సైకిలెక్కారు. తర్వాత ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ఏమాత్రం కదలిక లేదని, కాంట్రాక్టర్‌కు పనులు చేసే సత్తా లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా.. రాయపాటి సంస్థపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరి కదా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర సర్కార్‌కు దక్కగానే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెంచేసి ప్రయోజనం చేకూర్చారు. ఆ తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందుపెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.
కమీషన్ల దందా గడ్కరీకి చెప్పిన రాయపాటి
పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేకపోవడంపై అక్టోబర్, 2017లో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ సంస్థపై కేంద్రం వేటు వేస్తోందేమోనని భయపడిన రాయపాటి.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై.. సీఎం చంద్రబాబుకు భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే తమ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని, అందువల్లే పనుల్లో జాప్యం చోటుచేసుకుందని చెప్పినట్లు అప్పట్లో దుమారం రేగింది. ఆ తర్వాత చంద్రబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశం (2017 అక్టోబర్ 17) నిర్వహించిన గడ్కరీ.. దీనిపై చంద్రబాబును ప్రశ్నించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు.
కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసుకుని, వారిని ఆర్థికంగా దెబ్బతీస్తే పనులు ఎలా చేస్తారని చంద్రబాబును గడ్కరీ నిలదీయడంతో తాము ఆశ్చర్యపోయామని ఆయన వివరించారు. అయితే ఈ వ్యవహారం బయటపెట్టకుండా రాయపాటిని చంద్రబాబు ఇన్నాళ్లూ కట్టడి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు రావడం, నరసరావుపేట సీటును తనకు లేదా తన కుమారుడికి కేటాయించాలని రాయపాటి కోరుతుండగా.. చంద్రబాబు మాత్రం స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి శిద్ధా రాఘవరావుల అభ్యర్థిత్వాలను పరిశీలిస్తుండటం రాయపాటికి ఆగ్రహం తెప్పించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ముడుపుల బాగోతాన్ని తెరపైకి తెచ్చారని వివరించాయి. (చదవండి: రగిలిపోతున్న ‘రాయపాటి’)
Comments
Please login to add a commentAdd a comment