రిజర్వేషన్లు రద్దు చేయం | Reservations will not be scrapped while I am in power | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు రద్దు చేయం

Published Tue, Apr 23 2019 2:04 AM | Last Updated on Tue, Apr 23 2019 2:04 AM

Reservations will not be scrapped while I am in power - Sakshi

ఉదయ్‌పూర్‌లో ప్రధాని మోదీని సన్మానిస్తున్న బీజేపీ నేతలు

ఉదయ్‌పూర్, నందూర్బార్‌: తాను అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తర మహారాష్ట్రలో నందూర్బార్‌లో సోమవారం ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోదీ కోటా పరిమితుల్ని దాటి తాను ఏమీ చేయనని హామీ ఇచ్చారు. ‘‘డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మోదీ అధికారంలో ఉన్నంతవరకూ వాటిని ఎవరూ ముట్టుకునే సాహసం కూడా చేయలేరు‘‘ అని అన్నారు.

గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ వారి భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయించమని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అయ్యే చెరుకు నుంచి ఇథనాల్‌ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చునని, దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు కల్పన సులభంగా జరుగుతుందని అన్నారు.  కానీ కాంగ్రెస్‌–ఎన్సీపీ నేతలు ఆ పని చెయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అన్నీ అందేలా జన్‌ధన్‌ యోజన అకౌంట్లు తెరిచి, వాటిని ఆధార్‌తో లింకప్‌ చేసి, మొబైల్‌ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేశామని, ఈ చర్యల వల్ల కింది స్థాయిలో దళారుల జోక్యాన్ని అరికట్టి  అవినీతిని నిరోధించామని మోదీ వివరించారు.   

యూపీఏ పిరికిపందలా వ్యవహరించింది
జాతీయ భద్రత అంశంలో యూపీఏ పిరికిపందలా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉగ్రవాదం పీచమణచడంలో తమ ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసిందని అన్నారు. మహారాష్ట్ర నాసిక్‌ జిల్లా, రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో  సోమవారం పాల్గొన్న మోదీ శ్రీలంకలో పేలుళ్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం వల్లే భారత్‌లో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ‘2014కి ముందు భారత్‌ పరిస్థితి ఎలా ఉండేది ? బాంబు పేలుళ్లు ఒక నిత్యకృత్యంగా మారాయి. ముంబై, పుణె, హైదరాబాద్, వారణాసి, అయోధ్య, జమ్ము ఇలా ఎన్నో నగరాల్లో పేలుళ్లు జరిగాయి’ అని మోదీ గుర్తు చేశారు. అప్పట్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌–ఎన్సీపీ ప్రభుత్వం ఏం చేసేది? అచ్చంగా పాకిస్తాన్‌ మాదిరిగానే  ఒక సంతాప సభ ఏర్పాటు చేసి , నాలుగు కన్నీటి బొట్లు రాల్చి చేతులు దులుపుకునేది‘‘ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు.  

ఉగ్రవాదులు ఎక్కడున్నా పట్టుకోగలను
సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై సాక్ష్యాధారాలు కావాలన్న కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌ని తిప్పికొట్టారు. విపక్షాలే దీని గురించి ప్రశ్నిస్తున్నాయి కానీ  ప్రజలకు తమపై నమ్మకం ఉందన్నారు. ఈ విషయం మొదటి రెండు దశల ఓటింగ్‌ సరళిలోనే అర్థమైందన్నారు. తాను జాతీయ భద్రత, వంశ పరిపాలన గురించి మాట్లాడితే కొందరికి షాక్‌ తగులుతుందంటూ పరోక్షంగా రాహుల్‌కు చురకలు అంటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement