
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంపై శాసనసభలో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడుతుందనే భయంతో డ్రగ్స్ రాకెట్‌పై చర్చకు అనుమతించలేదని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్దేశపూర్వకంగానే తన ప్రశ్నను పక్కనపెట్టారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంతో కేటీఆర్‌కు సంబంధం ఉందని తాను చేసిన ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు తాను సిద్ధమని, కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.
డ్రగ్స్, మత్తు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ పిల్లల జీవితాలతో టీఆర్ఎస్ సర్కారు ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని సీఎం కేసీఆర్ బెదిరిస్తుంటారని, తాను చేసిన ఆరోపణలు అవాస్తమైతే తనను జైలులో పెట్టాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 56 పబ్బుల్లో కేసీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ పరిటాల సునీత బంధువులవే ఉన్నాయని ఆరోపించారు. వీరికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తోందన్నారు.
డ్రగ్స్ వ్యవహారంపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపైనే అనుమానాలున్నాయని పునరుద్ఘాటించారు. ఇంతకుముందు పలువురు ప్రముఖుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment