
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తాను కార్యరంగంలోకి దూకుతానని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమ వ‍్యవహారాలన్నింటినీ బట్టబయలు చేస్తానన్నారు. డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం చేసిన హడావుడి చూసి మధ్య తరగతి ప్రజలు సంతోష పడ్డారని, కానీ, విచారణ అనంతరం చర్యలు మాత్రం కనిపించటం లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే పబ్స్ ఉండేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక డ్రగ్స్, పబ్స్ పెరిగాయని, ప్రస్తుతం 59 పబ్‌లు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని వివరించారు.
డ్రగ్స్ సరఫరాదారులు కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అగ్రనేతలకు ‘ఈవెంట్ నౌ’ అనే సంస్థతో సంబంధం ఉందని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగం, మహిళలపై దాడులు తరచూ జరిగే సన్ బర్న్ పార్టీలను అదుపుచేయలేక గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయగా తెలంగాణ సర్కార్ మాత్రం ఆ తరహా పార్టీలను కొనసాగిస్తోందన్నారు. సన్ బర్న్ పార్టీలకు క్రీడా మైదానాలను సైతం ఇస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌కు చెందిన ‘ఈవెంట్స్ నౌ’ అనే సంస్థకు హైటెక్స్, గచ్చిబౌలి మైదానాలను ‘సన్‌బర్న్’ పార్టీల నిర్వహణ కోసం ప్రభుత్వం అప్పగించిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో వచ్చిన సంస్థలు ఎప్పుడూ నైట్ లైఫ్ అడగలేదని, కేవలం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఇది జరుగుతోందని ఆరోపించారు.
పబ్ లు, మ్యూజికల్ నైట్స్ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయని విచారణలో తేలిన తర్వాత కూడా ఇంకా ఎందుకు అవి కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. ‘ఎవరి ఒత్తిడులతో వాటికి అనుమతులు లభించాయి.. పోలీసుల రక్షణ కూడా ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.. ఇదేనా విశ్వ నగరం..అంటే’ అని ప్రశ్నించారు. 15ఏళ్ల పిల్లలకు కూడా పబ్‌లలో అనుమతి ఉందని పార్టీ నిర్వాహకులు చెప్తున్నారు.. ప్రభుత్వం ఎందుకు మిన్నకుంటోందనేది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొలువుల కొట్లాటకు అనుమతి ఇవ్వరు కానీ మాదక ద్రవ్యాల వినియోగించే పార్టీల కు అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. రోడ్ నంబర్ 36 లో హై లైఫ్ పబ్ ఉదయం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారని, హై లైఫ్ పబ్ లోకి వచ్చే వారి కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా గంట సేపు ఆపుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ..కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ తో పాటు అందరిపైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment