సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై స్పందించని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం రూపొందించిన 111 జీవో పరిధిలోకి వచ్చే జన్వాడ గ్రామంలో కేటీఆర్ తన బినామీ పేరుతో రాజ్‌మహల్ కట్టుకున్నారని లేఖలో ఆరోపించారు.
ఈ గ్రామాన్ని ఇప్పుడు జీవో నుంచి మినహాయించడం ద్వారా తన భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి 111 జీవోను సమీక్షిస్తామని కేటీఆర్ చెబుతున్నారని విమర్శించారు. పుప్పాలగూడలో రూ.30 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తిని కేటీఆర్ రూ. కోటికే ఎలా కొన్నారని రేవంత్ ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో రూ.8 కోట్లుగా చూపించిన కేటీఆర్ ఆస్తి 2018 నాటికి రూ.41 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు. గతేడాది టీఆర్‌ఎస్ పార్టీ విరాళాలు రూ.24 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ.188 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏంటో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడాదిలోనే ఇంత భారీ విరాళాలు ఎలా పెరిగాయని రేవంత్ లేఖలో ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment