సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో నిర్వహించిన రివర్స్ టెండర్ల వల్ల ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఆదా చేశామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సోమవారం వెల్లడించారు. తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాము రివర్స్ టెండర్లు వేయకపోతే ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లేదని ప్రశ్నించారు. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘వెలిగొండలో రూ. 61 కోట్లు మిగిలాయి. రాబోయే రోజుల్లో మరో రూ. 500 కోట్లు మిగులుతాయని భావిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ రివర్స్ టెండరింగ్ చేపడితే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇలా ఆదా అయిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. ప్రజాధనం ఆదా అవుతుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం మంచిదా? రేట్లు తగ్గించి ఆ డబ్బుతో పేదలను ఆదుకోవడం మంచిదా?’ అంటూ ప్రతిపక్షాన్ని నిలదీశారు.
చంద్రబాబు తన హయాంలో ఇలా చేసుంటే అంత డబ్బు మిగిలేది కదా? అలా కాకుండా ఎక్సెస్ టెండర్లు నిర్వహించి, ఇష్టమొచ్చిన నిబంధనలు పెట్టి తనకు అనుకూలంగా ఉన్నవారికి దోచిపెట్టారు. ఇసుక సమస్యపై రాద్ధాంతం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అయితే కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం వల్ల ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రి అనిల్ వివరించారు. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వెళ్తే తప్పులేదు కానీ, ముఖ్యమంత్రి వెళ్తే తప్పా? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లే చంద్రబాబు మాకొద్దంటున్నారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment