సోమవారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేత రేవూరి
హన్మకొండ: టీఆర్‌ఎస్, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వచ్చి రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మంత్రి హరీశ్‌రావు పార్టీ నుంచి తన వర్గంతో బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కూతురు, కుమారుడికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తనను అవమానిస్తున్నారనే ఆవేదనతో హరీశ్‌రావు ఉన్నారని చెప్పారు.
హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరీశ్ రియల్, ప్రాక్టికల్ పొలిటీషియన్, హార్డ్ వర్కర్ కూడా.. అసలు హరీశ్‌రావు లేని చంద్రశేఖర్‌రావును ఊహించలేం.. రాజకీయ ఊహ తెలిసిన నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు’అని పేర్కొన్నారు. అయితే.. హరీశ్‌రావు తన తెలివిని వక్రమార్గంలో ఉపయోగించి టీడీపీని విమర్శించడం తగదన్నారు. పార్టీలో తనకు ఆదరణ తగ్గడంతోనే మామ ముందు నిజాయితీ చాటుకోవడానికి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ముందస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకై కేసీఆర్ ఆయా రాష్ట్రాలు సందర్శించింది ఇందులో భాగమేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే హరీశ్‌రావు ఆనాడే కాంగ్రెస్‌లోకి వెళ్లే వారని పేర్కొన్నారు.
నా కోసం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ
నర్సంపేట నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉంటానని రేవూరి స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. నర్సంపేట నుంచి మరోసారి ప్రాతినిథ్యం వహించి.. 2024లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాము 45 సీట్లు అడిగామన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తమకు 14 సీట్లు మాత్రమే కేటాయించినట్లు ఢిల్లీలో ప్రకటించడాన్ని అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు లేకుండా ఎలా ప్రకటిస్తారని, తాము 21 సీట్లు కావాలని పట్టుదలతో ఉన్నామన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకున్నామని, ఈ అభిప్రాయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే స్వతంత్రంగానే పోటీ చేయాలన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment