సాక్షి, వరంగల్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ అవసరమని.. అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరారని మాజీ ఎమ్మెల్యే, ఇటీవల బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవూరి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా భావిస్తున్న కేసీఆర్.. తెలుగుదేశం పార్టీపై కక్షగట్టి ఆంధ్రా పార్టీగా ముద్రవేసి ప్రజలకు దూరం చేశారని పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హన్మకొండ పశ్చిమ నుంచి పోటీ చేసిన సందర్భంగా పలువురు ఓటర్లు, శ్రేయోభిలాషులు.. ‘మీరు మంచోళ్లే కానీ మీరు పోటీ చేస్తున్న పార్టీ రాంగ్’ అని చెప్పడంతో రైట్ పర్సన్‌గా రాంగ్ పార్టీ(టీడీపీ)లో ఉండలేక బీజేపీలో చేరానని ప్రకాశ్‌రెడ్డి వివరించారు.
‘పార్టీలు మారడం నాకు ఫ్యాషన్ కాదు.. అట్లనుకుంటే చాలా పార్టీలు, చాలా సార్లు, చాలా ఆఫర్లు ఇచ్చాయి... అయినా వెళ్లలేదు.. నేను స్వచ్చంద సంస్థలు నడవడం లేదు.. రాజకీయ పార్టీలో ఉన్నా... ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా.. రాజకీయ పునరేకీకరణ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుని ఆ పార్టీలో చేరాను’ అని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
లేఖలు ఇప్పించడంలో కీలకం
తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రబాబుతో రెండు సార్లు అనుకూలంగా లేఖలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించానని.. అప్పటి కేంద్రమంత్రి చిదంబరంను కలిసిన అఖిలపక్షంలో కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించానని ప్రకాశ్‌రెడ్డి గుర్తుచేశారు. కాగా, టీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రజాకార్లను మించిన నిర్భంధం సాగుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిందని, కుటుంబ పెత్తనం నడుస్తోందదని పేర్కొన్నారు.
ఇటీవల మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనని పేర్కొన్న ఆయన... టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఆలోచించి నిర్బంధం, అణచివేతల నడుమ కొనసాగే కంటే రాజకీయ పునరేకీకరణ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.
నర్సంపేట ప్రజలతోనే నా జీవితం ముడిపడి ఉంటుంది
రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం కల్పించిన, ఆశీర్వదించిన నర్సంపేట నియోజకవర్గం ప్రజలతోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉంటుందని రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడంలో ముందు నిలుస్తానని తెలిపారు. ‘మా నాన్న కూడా ఒకప్పుడు ప్రజలతో చెప్పారు... నాకు ముగ్గురు కొడుకుల్లో ఒకరిని నర్సంపేట ప్రజలకు ఇస్తున్నా’ అని.. ఆ మాటకు కట్టుబడి నర్సంపేట ప్రజలతోనే ఉన్నానని, హన్మకొండ పశ్చిమలో 44 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయంటే నర్సంపేటలో ఉన్న పేరు, అక్కడ చేసిన పనులే కారణమని తెలిపారు. అయితే, మిగిలిపోయిన పనులు కూడా చేసి నర్సంపేట ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment