
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు తప్పుకు మహిళా అధికారిణిని బలి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయేసరికి నెపాన్ని అధికారులపైకి నెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ నెపాన్ని మహిళా అధికారి అనురాధపై నెట్టారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలపై పీఠాధిపతులు చంద్రబాబును నిలదీయాలని ఎమ్మెల్యే రోజా అన్నారు.