సాక్షి, హైదరాబాద్ : ‘పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తామంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నమోదైన దరఖాస్తులను తొక్కిపెట్టింది. నిరుపేదలకు రూ.5లక్షల వరకు వైద్యం అందించే.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పక్కనబెట్టింది. రైతులకు నష్టపరిహారాన్నిచ్చే.. ఫసల్ బీమా పథకాన్ని అడ్డుకుంటోంది. ఇలా మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే అమలు చేయడంలేదు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ఉదారంగా రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఇస్తుంటే కేంద్రం పేరు కనిపించకుండా.. టీఆర్‌ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఎయిమ్స్ మంజూరు, కాళేశ్వరానికి అనుమతులు, గిరిజన విశ్వవిద్యాలయం ఇలా రాష్ట్రానికి కేంద్రం ఎన్నో చేసిందన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులతో కేసీఆర్ కిట్స్ ప్రారంభించి.. టీఆర్‌ఎస్ సొంత డబ్బా కొట్టుకుంటోంది. అందుకే 14వ ఆర్థిక సంఘం ద్వారా మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను ప్రచారంలో ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఉండి రూ.16,500 కోట్లు తెస్తే, బీజేపీ ప్రభుత్వం రూ.1,15,000 కోట్లు ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ‘మిషన్ 60 ప్లస్’నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాలు, అధికారంలోకి వచ్చేందుకు చేపట్టబోయే కార్యాచరణను ఆయన ‘సాక్షి’ఇంటర్వూ్యలో వెల్లడించారు.
ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందా? ఎలా ముందుకు వెళ్తున్నారు.?
లక్ష్మణ్: వచ్చే ఎన్నికలకు మేం పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ప్రతి ఓటరును చేరుకునే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజాసమస్యలపై చేసిన పోరాటం, ఉద్యమాలు, విమోచన యాత్ర, జనచైతన్య యాత్ర ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి. మొదట్నుంచీ మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉన్నాం. ముందస్తు ఎందుకో కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదు. ప్రజల ముందు పలచనైపోయారు. కొత్త రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్లు పనిచేయమని అవకాశం ఇచ్చారు. కానీ 9 నెలల ముందే ఎన్నికలకు వెళ్లడంతో వ్యతిరేకత ఉంది. నిరుద్యోగ, పేదలకు రెండు పడకల ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత ఇంగ్లిషు మీడియం విద్య, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హమీలన్నీ మేనిఫెస్టోలో పెట్టి.. నాలుగున్నరేళ్లలో తుంగ లో తొక్కారు. ‘కమీషన్ కాకతీయ’, ‘కమీషన్‌న్ భగీరథ’నినాదాన్ని ఎత్తుకున్నారు.
మోదీ చరిష్మా తెలంగాణలో పని చేస్తుందని భావిస్తున్నారా?
తప్పకుండా పనిచేస్తుంది. అవినీతి రహిత, ప్రజాసంక్షేమ పాలనను మోదీ అందిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయం మేమేనన్న భావన ప్రజల్లో వచ్చింది. కాంగ్రెస్‌ను నమ్మిమోసపోయాం. పదేళ్లలో చేయనిది ఇపుడు చేస్తుందా? అని వాళ్లు అనుకుంటున్నారు. బూటకపు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. టీఆర్‌ఎస్ పథకాలు, కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటే.. కేసీఆర్‌కు అభద్రతాభావం ఎందుకు? చెప్పినవే చేయలేదు. ఇపుడు చేస్తామంటే ఎవరూ నమ్మరు. మా ప్రచారాçస్త్రం, బ్రహ్మాస్త్రం నరేంద్రమోదీయే. చాణక్య నీతి, విజయ సూత్రాలకు పేరుగాంచిన అమిత్‌షా మన రాష్ట్ర ఎన్నికలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మాలో ఉత్సాహం నింపుతున్నారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతాం. తెలంగాణలో పాగా వేస్తాం.
ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందన్న వార్తలపై..
ఎన్నికలతో సంబంధం లేకుండా మేమెప్పుడూ ప్రజల్లోనే ఉన్నాం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం. రెండేళ్లుగా నేను వ్యక్తిగతంగా అన్ని జిల్లాల్లో పర్యటించాను. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేశాను. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదు. వారికి లొసుగులు, లోపాలు ఉన్నాయి. పదేళ్ల దోపిడీ, అవినీతి, భూకుంభకోణాలు ప్రజలు మరిచిపోలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వేరు కాదు. రెండూ ఒక గూటి పక్షులే. మజ్లిస్ ఎజెండాను అమలు చేసిన పార్టీలే. అందుకే ‘ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి ఇవ్వండి’అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మోదీ విధానాలు, పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతోనే.. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై..
టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన అనేది ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహారం. మేము మాత్రం 119 స్థానాల్లో బలమైన అభ్యర్థు«లను బరిలో దించుతాం. ఎవరితో రాజీ పడే ప్రసక్తి లేదు. మజ్లిస్‌తో దోస్తీ చేసే టీఆర్‌ఎస్‌తో మాకు అవగాహనేంటి? నేను చేపట్టిన జనచైతన్య యాత్రకు అనూహ్య స్పందన లభించింది. 14 ఎంపీ స్థానాలు, 2వేల గ్రామాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాను. దేశ వ్యాప్తంగా మోదీ, అమిత్‌షా దెబ్బకు కాంగ్రెస్ కంచుకోటలు కూలిపోతున్నాయి. ‘ఎర్ర’కోటలు బద్ధలు అవుతున్నాయి. ప్రజలు అవకాశం ఇస్తే గులాబీ గడీలు కూడా బద్దలు కొడుతాం. ఆ సామర్థ్యం బీజేపీకే ఉంది.
మజ్లిస్‌ను అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు?
మజ్లిస్‌ను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతాం. మజ్లిస్‌పై పాతబస్తీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. మెట్రోరైల్ ప్రాజెక్టును అడ్డుకున్న చరిత్ర మజ్లిస్‌ది. ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలను ప్రభావితం చేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్నాం. ముస్లిం పేదలు బీజేపీకి అండగా ఉన్నారు. మజ్లిస్ ముఖ్యనేతలను ఢీకొనే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు మాకున్నారు.
119 స్థానాల్లో గెలువగలిగే అభ్యర్థులు ఉన్నారా?
తెలంగాణలో ఏ పార్టీ చేయని కార్యక్రమం మేం చేపట్టాం. అసెంబ్లీ వారీగా అభిప్రాయాన్ని సేకరించాం. ఎక్కడ కూడా 10–15 మందికి తగ్గకుండా పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. అక్టోబరు 3, 4, 5 తేదీల్లో 119 స్థానాల్లో అభిప్రాయ సేకరణ చేపడితే వేల సంఖ్యలో విద్యావంతులు, ముస్లింలు, తటస్థులు, పార్టీ నాయకులు వచ్చారు. మా ప్రక్రియ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ సీట్లకోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు మా పార్టీ ఎన్నికల కమిటీ, ఛార్జిషీట్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ పూర్తి స్థాయిలో నిమగ్నమై పని చేస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి ఆర్గనైజర్లు వచ్చారు. వారు బూత్ స్థాయిలో ప్రతి 100 ఓటర్లకు ఒకరు చొప్పున పని చేస్తున్నారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాష్ట్ర పార్టీ విఫలమైందన్న వాదనలపై..
అలాంటిదేమీ కాదు. మేము పక్కాగా వ్యవహరిస్తున్నాం. కేంద్ర పథకాలను ప్రజల్లోకి పక్కాగా తీసుకెళుతున్నాం. మోదీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, సాహసోపేత నిర్ణయాలు బీజేపీ విజయానికి దోహదపడ్తాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. 2.20 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తే దారి మళ్లించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద వచ్చిన దరఖాస్తులను తొక్కి పెట్టారు. అది అమలైతే మోదీకి పేరు వస్తుందనే పక్కనపెట్టారు. కేసీఆర్ పేదల బద్దవ్యతిరేకి.
బీజేపీలోకి వలసలున్నాయా?
తప్పకుండా చేరతారు. స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చాలా మంది ఇతర ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సరైన సమయంలో వారందరిని పిలుస్తాం. తెలంగాణలో మేం దీటైన ప్రత్యామ్నాయంగా ఎదుగబోతున్నాం. ఇప్పటికే అమిత్‌షా మూడు సభల్లో పాల్గొన్నారు. ఈనెల 28 యువ ర్యాలీలో పాల్గొంటారు. ప్రధాని మోదీ నాలుగు సభల్లో పాల్గొంటారు. మహరాష్ట్ర సీఎం పడ్నవీస్, యూపీ సీఎం ఆదిత్యనా«థ్, కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారు.
బీజేపీ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతుంది?
మోదీ అభివృద్ధి ఎజెండానే మాకు ప్రధానం. వికాస్ నినాదమే మమ్మల్ని గెలిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇప్పటికే ఇంటింటికీ తీసుకెళ్లగలిగాం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు, వారివి విభజన రాజకీయాలు. మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే మా ప్రచారాస్త్రాలు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’నినాదాన్ని చేతల్లో చూపుతున్నాం. అందరి సంక్షేమం, అవినీతిరహిత పాలన అందించిన ఖ్యాతి మోదీదే. కాంగ్రెస్ కాలంలో కరెంటు కోతలు.. టీఆర్‌ఎస్‌వి మాటల కోతలు కనపడితే.. బీజేపీ మాత్రమే పేద ప్రజల జీవితాల్లో విద్యుత్ వెలుగులు నింపింది. మోదీ మాత్రమే పేదలు, రైతు బాంధవుడిగా ఉన్నారు. చరిత్రలో మొదటిసారి 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. రైతు బంధు కంటే మోదీ అపద్బంధు అనే ప్రజలు నమ్ముతున్నారు. ఇవన్నీ బీజేపీకి ప్రచారాస్త్రాలే.
టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది కదా..?
మా మధ్య అలాంటి బంధాల్లేవని బహిరంగంగానే చెబుతున్నాం. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య సంబంధాలున్నాయనేది కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ మద్దతుతో 27 సీట్లున్న జేడీఎస్ ప్రభుత్వాన్ని చేసింది. కేసీఆర్ చెప్పినందుకే కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామే స్వయంగా వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు, రాహుల్‌గాంధీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. వీరంతా ఒకగూటి పక్షులేననేది సుస్పష్టం. ఎన్నికల తరువాత కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసే ప్రమాదం ఉంది. ప్రజలు గమనించి.. అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్ర పార్టీలో ముఖ్యనేతలకు సఖ్యత లేదన్నది వాస్తవమా?
సమన్వయం లేదనడం అసత్యం. మేమంతా మంచి సమన్వయంతో పని చేస్తున్నాం. తరచూ సమావేశమై వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. బాధ్యతలను పంచుకుని మరీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పని చేస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది. మాపార్టీ చాపకింద నీరులా విస్తరిస్తోందనే విపక్షాల్లో అభద్రతా భావం నెలకొంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతల్లోనే ఒకరంటే ఒకరికి పడదు. మాకు ఆ సమస్యే లేదు. గత ఎన్నికల్లో గెలిచిన 15మంది టీడీపీ సభ్యుల్లో 13మంది బిచానా ఎత్తేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఓటుకు కోట్లులో అడ్డంగా దొరికిపోయారు. అలాంటి చంద్రబాబు మళ్లీ పొత్తు పేరుతో ముందుకు వస్తున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకంగా టీడీపీని పెడితే.. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌కు తాకట్టు పెడుతున్నది చూస్తుంటే ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది.
బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు?
టీఆర్‌ఎస్, మహాకూటమి ఇద్దరూ మా ప్రధాన ప్రత్యేర్థులే. రెండు పార్టీలపై ప్రజల్లో విశ్వాసం పోయింది. టీడీపీ తెలంగాణలో పేలని తుపాకి అయింది. టీఆర్‌ఎస్ చెల్లని నాణెం అయింది. కాంగ్రెస్ పంక్చర్ అయిన బస్సు అని తేలిపోయింది. ప్రజలు వికసిస్తున్న కమలంవైపే చూస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే లేకుండా 2% ఓట్లు మాత్రమే ఉన్న త్రిపుర, మణిపూర్‌ల్లో బీజేపీని ప్రజలు గెలిపించారు. అస్సాం, హర్యాణా, ఉత్తరప్రదేశ్‌లో గెలిచాం. తెలంగాణలోనూ సత్తా చాటుతాం.
Comments
Please login to add a commentAdd a comment