
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఓ టీవీ ఛానెల్ చర్చ సందర్భంగా ప్రధాని మోదీని జాతిపిత( దేశ్ కా బాప్)గా బీజేపీ నేత సంబిట్ పాత్రా అభివర్ణించడం వివాదానికి కేంద్ర బిందువైంది. పాత్రా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహాత్మా గాంధీ జన్మించిన గుజరాత్ ప్రజల మనోభావాలను బీజేపీ నేత పాత్రా వ్యాఖ్యలు తీవ్రంగా గాయపరిచాయని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు.
జాతిపితగా దేశప్రజలు స్మరించుకునే మహాత్మా గాంధీని బీజేపీ నేత వ్యాఖ్యలు అగౌరవపరిచినట్టేనని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తమను టార్గెట్ చేసి అవమానించినా సహించామని,బీజేపీ ప్రతినిధులు మహాత్మాగాంధీని అవమానించిన తీరును మాత్రం కాంగ్రెస్ పార్టీ సహా 130 కోట్ల మంది భారతీయులు సహించరని స్పష్టం చేశారు.
గాంధీని అవమానించిన ఇదే బీజేపీ నాథూరాం గాడ్సేకు మధ్యప్రదేశ్‌లో గుడి కట్టించిందని సుర్జీవాలా ఆరోపించారు. ఆ రాష్ట్ర మంత్రి గాడ్సేను మహాపురుష్‌గా అభివర్ణించారని గుర్తుచేశారు. బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యల పట్ల ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బీజేపీ ప్రతినిధి పాత్రాను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసి నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment