
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంతోపాటు తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కారు రైతులను ఆగం చేశాయని, రైతులు, దళితులంటే ఈ పాలకులకు గిట్టదని టీ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్‌ల పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని మండిపడ్డారు.
శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన 84వ ఏఐసీసీ ప్లీనరీ సభ జరిగింది. రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాక జరుగుతున్న తొలి ప్లీనరీలో తెలంగాణ నుంచి 400 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అతిరథ మహారథులు వేదికపై ఆశీనులవగా వేలాది మంది నాయకులను ఉద్దేశించి సంపత్ ప్రసంగించారు. వ్యవసాయం, దళితులపై మాట్లాడే అరుదైన అవకాశం ఆయనకు లభించింది.
తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలు అధికం
దేశంలో ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, అత్యధికంగా తెలంగాణలో దాదాపు 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్... అధికారంలోకి వచ్చాక మాట మార్చి రుణమాఫీని నాలుగు విడతలుగా చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మద్దతు ధర కావాలని తెలంగాణలో ఉద్యమం చేసిన రైతులను పోలీసుల చేత కొట్టించారని, కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఉత్తమ్ ఆరోపించారు. గిరిజన రైతులను దొంగలుగా చిత్రీకరించి బేడీలు వేసి వీధుల్లో తిప్పారని, భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లాగా ప్రవర్తించిందని దుయ్యబట్టారు. రెండు పంటలు పండే బంగారం లాంటి భూములను సాధ్యంకాని ప్రాజెక్టల కింద ముంచేందుకు సిద్ధమైందన్నారు.
సాగును పండుగలా చేసింది కాంగ్రెస్సే...
దేశంలో వ్యవసాయాన్ని పండుగలా కాంగ్రెస్ ప్రభుత్వాలు మార్చాయని, అనేక వ్యవసాయ సంస్కరణలు చేపట్టిన ఘతన కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కిందని ఉత్తమ్ పేర్కొన్నారు. దేశమంతటా ఏకకాలంలో రూ. 75 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసిన ఘన చరిత్ర గత యూపీఏ ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు.
ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించి రైతులను సంక్షోభం నుంచి బయటపడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని ఆయన వివరించారు. ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, మర్రి శశిదర్‌రెడ్డి, మధు యాష్కీగౌడ్, రేవంత్‌రెడ్డి, బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళితులపై సర్కారు అణచివేత
తెలంగాణలో ప్రభుత్వ పెద్దల ఇసుక మాఫీ యాకు దళితులు బలవుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఇసుక లారీలు వద్దని ఉద్యమించిన దళి త, గిరిజన, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధితులను పరామ ర్శించేందుకు వచ్చిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
తెలంగాణ రాజ్యహింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. వీటిపై ప్రశ్నిస్తే తమను శాసనసభలో లేకుండా చేసేందుకు కుట్ర చేశారని ఉత్తమ్ విమర్శించారు. అసెంబ్లీలో తనతోపాటు కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదవులను రద్దు చేసే సాహసం చేశారని ధ్వజమెత్తారు.