
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను పూర్తి చేస్తా మని టీఆర్‌ఎస్, బీజేపీలు హామీ ఇచ్చి మోసం చేశాయని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం చేసి సీఎం చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలోనూ, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంలోనూ సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు.