
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తమను ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని శాససభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ ఆరోపించారు. వీరిద్దరూ బుధవారం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. స్పీకర్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం చూపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, 12 గంటల్లోనే గెజిట్ ప్రచురించారని వెల్లడించారు. తమపై చేసిన ఆరోపణలకు సంబంధించిన విజువల్స్ ఇవ్వడం లేదని, కొన్ని విజువల్స్ మాత్రమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని ఆరోపించారు. శాసనసభలో గందరగోళ ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల పాటు స్వామిగౌడ్ గవర్నర్‌తో పాటే ఉన్నారని గుర్తుచేశారు.
ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు: షబ్బీర్
శాసనసభ సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ తెలిపారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చేసేందుకు కేసీఆర్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ‘ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు కాబట్టి చర్య తీసుకునే హక్కు గవర్నర్‌కే ఉంటుంది. ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయకుండా, అప్రజాస్వామికంగా వేటు వేశారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మమ్మల్ని సభ నుంచి పంపించార’ని షబ్బీర్ అలీ విమర్శించారు.