
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీకి దూరంగా ఉండాలని శివసేన నిర్ణయం తీసుకుంది.
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి శివసేన హాజరు కాబోదని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం రౌత్ ఈ విషయం వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రయ సాగుతోందని, ఈ దిశగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు సంజయ్ రౌత్ ఢిల్లీకి చేరుకున్నారు.మరోవైపు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమైన కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేతల మధ్య ఆదివారం ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది. మహారాష్ట్రలో అధికార పంపకంపై తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలసిందే.