
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల టీడీపీ పాలనలో కొనసాగించిన అవినీతి, అరాచకాల నేపథ్యంలో తమ పార్టీ గెలుపు కష్టమని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆంతరంగిక సమావేశాల్లో అంగీకరిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి పోటీ చేసినా నెగ్గలేరని అంటున్నారు. నరసరావుపేట ఎంపీ టిక్కెట్‌ను రాయపాటి సాంబశివరావుకు, సత్తెనపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ను రాయపాటి రంగారావుకు కేటాయించే విషయంలో చంద్రబాబు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాయపాటి వర్గీయులు గురువారం గుంటూరులో సాంబశివరావు నివాసంలో ఆందోళనకు దిగారు. నరసరావుపేట ఎంపీ సీటుకు భాష్యం రామకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీని వీడే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రాయపాటి సాంబశివరావు గురువారం తన వర్గీయులతో భేటీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాయపాటి నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లాలో ఎక్కడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని, ఓడిపోయే పార్టీ టిక్కెట్లు తమకు అవసరం లేదని డొక్కా, జీవీకి రాయపాటి అనుచరులు తేల్చిచెప్పారు.
రూ.వంద కోట్లు ఖర్చు పెట్టినా టీడీపీ గెలవదు
‘‘సత్తెనపల్లి టిక్కెట్ కోడెలకు ఇస్తామంటున్నారు. అక్కడి కార్యకర్తలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓడిపోయే వాళ్లకే టిక్కెట్లిస్తారా? కోడెల కుటుంబం చేసిన అరాచకాల కారణంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఉంది. రూ.వంద కోట్లు ఖర్చుపెట్టినా ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదు. చంద్రబాబు పోటీ చేసినా గెలవడం కష్టం. ఆ సీట్లు మాకు అవసరం లేదు. ఓటమి భయంతోనే కోడెల నరసరావుపేట నుంచి పోటీ చేయను అంటున్నారు. గెలిచే పరిస్థితి ఉంటే కోడెలను నరసరావుపేట నుంచి పోటీ చేయమనండి’’ అని డొక్కా మాణ్యివరప్రసాద్, జీవీ ఆంజనేయులపై రాయపాటి వర్గీయులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment