సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఫిరాయింపుదారులైన 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘సభ ప్రారంభతేది నాటికి ఆ 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసి, నలుగురు మంత్రులను బర్తరఫ్‌చేసి, శాసనసభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలమీద మాట్లాడేందుకు అవకాశం కల్పించాలి’ అని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యనేతల కీలక భేటీ వివరాలను ఆ పార్టీ శాసనసభ ఉపనేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలు, రుణమాఫీ, చంద్రబాబు విదేశీ పర్యటనలు, మెడికల్ సీట్లలో మైనారిటీలకు అన్యాయం, అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్ర తదితర అంశాలపై నాయకులతో అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్చించారని పెద్దిరెడ్డి తెలిపారు. అసెంబ్లీని ఆగస్టులోనే నిర్వహించాల్సిఉండగా, అలా చేయకుండా, పాదయాత్ర ప్రారంభసమయంలో నిర్వహిస్తుండటం అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించినట్లు, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనియ్యకుండా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నదని, అలాంటి నేపథ్యంలో అసలు సభరే హాజరుకాకపోవడమే సరైన నిర్ణయమని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్లు మీడియా ప్రకటనలో పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనే నిర్ణయిస్తారని, ఈ అంశంపై అక్టోబర్ 26న జరగనున్న ఎల్పీ సమావేశంలో మరోసారి చర్చించి, అధ్యక్షుడు తుది ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు.
పాదయాత్రపై : నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి నేటి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో యాత్ర జరిగే జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు, త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment