‘బీజేపీని వదిలేశా.. పార్టీలోకి రమ్మంటున్నారు’ | TDP left BJP..welcome muslims into tdp | Sakshi
Sakshi News home page

‘బీజేపీని వదిలేశా.. పార్టీలోకి రమ్మంటున్నారు’

Published Tue, Apr 3 2018 1:09 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

TDP left BJP..welcome muslims into tdp - Sakshi

దీక్షలో కూర్చున్న మైనార్టీలకు పూలమాల వేస్తోన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, విజయవాడ: బీజేపీని విడిచి పెట్టాను.. ముస్లిం మైనారిటీలను పార్టీలోకి రమ్మని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ మైనారిటీల విభాగం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమం ఇప్పుడు చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.

మైనారిటీలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని.. టీడీపీ, బీజేపీలు మైనారిటీలకు ద్రోహం చేసిన పార్టీలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మైనారిటీకి అయినా చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారా? అని సూటిగా అడిగారు. మైనారిటీల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, మరోసారి మైనారిటీలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కలుస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, మోదీ, వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారో మరిచిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మాత్రమే హోదా ఆకాంక్షను బతికించారని అన్నారు. యువభేరీ సభలు, ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో ఆందోళనలతో హోదా కోసం పోరాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోన్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు స్పష్టత లేదు: సామినేని
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టత లేదని, ఆయనకు కావాల్సింది అక్రమ సంపాదనేనని విమర్శించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదని, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ, ఒక్క గిరిజనుడు లేడని చెప్పారు. ఇదేనా చంద్రబాబు పాలన? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని అడిగారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే.. చంద్రబాబు సహకరించక పోగా ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయం లబ్ది కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement