minorty
-
లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలానే ఉంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లతో భారీ మెజార్టీలో ఉన్న బీజేపీ ప్రస్తుతం 273 స్థానాలతో మైనార్టీకి ఒక్క స్థానం దూరంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు వరుసగా ఓటమి చవిచూస్తున్నారు. 13 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య 273కి చేరింది. మరో 12 మంది కూటమి సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది. బీజేపీకి ఎంతో పట్టున్న గోరఖ్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఓడిపోవడంతో 2019లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపై అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. యూపీలో గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న కాషాయ దళం గోరఖ్‌పూర్‌తో సహా, పూల్పుర్, కైరానా స్థానాల్లో ఘోర పరాభావం పాలైంది. మధ్యప్రదేశ్, పంజాబ్‌లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాజస్తాన్‌లో సిట్టింగ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ చేతిలో ఓటమి చవిచూశారు. కర్ణాటక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా విపక్షాల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇన్ని పరాజయాల మధ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదు: వైఎస్సార్సీపీ
విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి, మచిలీపట్నం జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారథి వ్యాఖ్యానించారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారధి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం పోరాడే ప్రతి సంస్ధకు వైఎస్ఆర్సీపీ మద్ధుతు ఇచ్చిందని తెలిపారు. పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధపడిందని వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబుకు హోదాపై పోరాడే ధైర్యం ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. కేంద్రం ముందు చంద్రబాబు సాగిలపడుతున్నారని, కేంద్రం మోసం చేసిందంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హోదా ఇవ్వడానికి వీలులేదన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని సూటిగా ప్రశ్నించారు. ‘పదకొండు రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తామని కేంద్రం చెప్పినప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అవిశ్వాసం పెడదామంటే..ఏం ఒరుగుతుందని చంద్రబాబు అనలేదా? రాజీనామాలు చేద్దామంటే...మీరెందుకు ముందుకు రారు.’ అని అన్నారు. బీజేపీతో కలవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి కూడా పాల్గొన్నారు. మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో వున్న చంద్రబాబుకు మాత్రం ప్రత్యేక హోదా పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడమీద పిల్లిలా రాజకీయ పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో పోరాటం చేయటంలేదని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ లబ్దిపొందారని, ఇప్పుడు అవసరం తీరగానే బీజేపీని వదిలి కొత్త మిత్రులను వెతుక్కుంటున్నారని విమర్శించారు. అటువంటి చంద్రబాబుకు, వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. ఇంకా బీజేపీతో చంద్రబాబు లాలూచీ నడుస్తోందని, ఎంపీలతో రాజీనామా చేయమని ప్రజలు కోరుతుంటే..చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలను మైనారిటీలే కాదు..ఏ వర్గం కూడా నమ్మేపరిస్థితి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణ నిథి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని గతంలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ హోదా కోసం చేస్తున్న పోరాటం చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ ప్రలోభాలు పెట్టారని, మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్‌కు చివరికి దక్కింది వక్ఫ్ బోర్డు పదవి అని, చంద్రబాబు మోసాలు ఇలాగే ఉంటాయని చెప్పారు. -
‘బీజేపీని వదిలేశా.. పార్టీలోకి రమ్మంటున్నారు’
సాక్షి, విజయవాడ: బీజేపీని విడిచి పెట్టాను.. ముస్లిం మైనారిటీలను పార్టీలోకి రమ్మని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ మైనారిటీల విభాగం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమం ఇప్పుడు చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. మైనారిటీలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని.. టీడీపీ, బీజేపీలు మైనారిటీలకు ద్రోహం చేసిన పార్టీలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మైనారిటీకి అయినా చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారా? అని సూటిగా అడిగారు. మైనారిటీల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, మరోసారి మైనారిటీలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కలుస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, మోదీ, వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారో మరిచిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మాత్రమే హోదా ఆకాంక్షను బతికించారని అన్నారు. యువభేరీ సభలు, ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో ఆందోళనలతో హోదా కోసం పోరాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్పష్టత లేదు: సామినేని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టత లేదని, ఆయనకు కావాల్సింది అక్రమ సంపాదనేనని విమర్శించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదని, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ, ఒక్క గిరిజనుడు లేడని చెప్పారు. ఇదేనా చంద్రబాబు పాలన? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని అడిగారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే.. చంద్రబాబు సహకరించక పోగా ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయం లబ్ది కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. -
నిషేధం పేరుతో మైనార్టీలపై దాడులు..
హైదరాబాద్ : పశుమాంసం నిషేధం పేరుతో సాధారణ ప్రజలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..‘ ముస్లింలను భయభ్రాంతులకు గురిచేసి రెండవ తరగతి ప్రజలుగా ముద్రవేస్తున్నారు. యూనివర్శిటీల్లో దళిత విద్యార్థులు, వామపక్ష విద్యార్థులపై దాడులు పెరుగుతున్నాయి. ఒక్క ఏబీవీపీ తప్ప వేరే విద్యార్థి సంస్థ ఉండొద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రగతిశీల భావాలున్న విద్యార్థులను చదువుకు దూరం చేసేలా స్కాలర్షిప్లు రద్దు చేస్తున్నారు’ అని అన్నారు. ‘ వందలకోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్న బడా వ్యాపారులు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలు పారిపోతున్నారు. తెలిసినవారు కొందరే..ఇంకా తెలియని వారెందరో ఉన్నారు. మాల్యా రూ.9 వేల కోట్లు, నీరవ్ మోడీ రూ.12 వేల కోట్లు ముంచి పారిపోయారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి సుష్మ స్వరాజ్, వసుంధరారాజేతోపాటు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీకి మరో దేశానికి వెళ్లేందుకు సుష్మ స్వరాజ్ మనవతా దృక్పదంతో సహాయం చేశారు ’ అని తెలిపారు. బ్యాంకులను పంగనామాలు పెట్టిన వారే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని కుట్రచేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులను దివాలా తీయించినవారే ప్రైవేట్ పరం కోసం ఒత్తిళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల నుంచి వసూలు కాని బాకీలు 7 శాతం మాత్రమేనని, బడా బాబులు ఎగ్గొట్టినవే 90 శాతం ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ప్రజలకు తెలిసేలా వామపక్షాలు కృషిచేస్తోంటే అదంతా తప్పని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు. -
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు అ ర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను జిల్లా మైనార్టీ శాఖ ఆహ్వానిస్తోంది. అలాగే ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి రత్న కల్యాణి తెలిపారు. రాజేంద్రనగర్ (బాలురు, బాలికలు), ఫరూఖ్‌నగర్ (బాలికలు), శేరిలింగంపల్లి (బాలురు), హయత్‌నగర్ (బాలురు, బాలికలు), ఇబ్రహీంపట్నం (బాలికలు), బాలాపూర్ (బాలురు), మెయినాబాద్ (బాలికలు)లో పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ముస్లిం, క్రైస్తవ, పార్సీ, జైనులు, సిక్కులు, బౌద్ధ విద్యార్థులకు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీ సీ, ఇతరులకు 25 శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 20వ తేదీలోగా www. tmreis. telangana. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, పాస్ పోర్ట్‌సైజు ఫొటో, బర్త్ సర్టిఫికెట్, బోనాఫైడ్, వార్షికాదాయ ధ్రువపత్రాలు అవసరమ న్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సంప్రదించాని కోరారు. -
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
భువనగిరి : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్హాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ డెవలప్మెంట్ కమిటీ ఆ«ధ్వర్యంలో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, కౌన్సిలర్ ఫాతేమహ్మద్, కమిటీ అధ్యక్షుడు ఎం.ఎ.హఫీజ్వసీమ్, కార్యదర్శి సయ్యద్ జావెద్ఖాద్రీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షడు అమరేందర్,మహ్మద్ మొయినోద్దీన్, సయ్యద్ ఇఫ్తాఖార్ ఫహీమ్, డాక్టర్ ఎస్ఎస్ అలీ, మహ్మద్ సర్వర్, రఫియొద్దీన్, ఎం.ఎం.అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమం
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనా కాలంలో మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్ఆర్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 9వ వార్డు బండిమెట్టకు చెందిన ఇమ్రాన్ ఖాన్, అయ్యూబ్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, మహబూబ్, వలి, నజీర్, చాంద్, జమీల్, అబ్దుల్ సలీమ్, షేక్షా, బాబులతో పాటు మరో 80 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 20వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, చందు, నటరాజ్, హరి, మధు, వెంకటేశ్, నాగేంద్ర, వలి, మహేశ్‌తో పాటు మరో 150 మంది స్థానికులు పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని తెలిపారు. తండ్రిబాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే సువర్ణ పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.