సాక్షి, అమరావతి : గ్రామ వాలంటీర్లు తమపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. వాలంటీర్లకు కేటాయించిన 50 కుటుంబాల సమస్యలను 72 గంటల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...దేశ చరిత్రలోనే ఇదొక అద్వితీయ ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మానస పుత్రిక అయిన నవరత్నాల ద్వారా ప్రభుత్వం నుంచి దాదాపు 35 కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయబోతున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకాలు లేవన్నారు.
ఇక రాష్ట్రంలో 11,128 గ్రామ, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 4 లక్షల 20 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు స్వలాభంతో పనిచేశాయని విమర్శించారు. ఓడిపోయిన టీడీపీ నేతలను ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారని ఆరోపించారు. అయితే సీఎం జగన్ ప్రభుత్వంలో తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అలాంటిది కాదని, దీని ద్వారా అర్హులైన వారికి త్వరితగతిన పథకాలను చేరువ చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment