గెయిల్ సర్కార్ తొహార్ | Shatrughan Sinha says Modi government is gone | Sakshi
Sakshi News home page

బీజేపీపై మరోసారి షాట్‌గన్‌ ఫైర్‌

Published Sat, Oct 14 2017 9:31 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

Shatrughan Sinha says Modi government is gone - Sakshi

సాక్షి : నటుడు, బీజేపీ షాట్ గన్‌ శతృఘ్నసిన్హా మరోసారి పార్టీ ముఖ్యనేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టూ మెన్‌ ఆర్మీ(మోదీ, అమిత్‌ షా పేర్లను ప్రస్తావిస్తూ...) గా తమ ప్రభుత్వం నడుస్తోందంటూ ఆయన తెలిపారు. శనివారం పట్నా యూనివర్సిటీ వేడుకల్లో మోదీ పాల్గొనబోతుండగా.. ఆ కార్యక్రమానికి శతృఘ్న సిన్హాకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో మీడియా శుక్రవారం ఆయనను ఈ విషయమై ప్రశ్నించింది.

అధిష్టానం పట్టించుకోవట్లేదు కాదా.. మరి పార్టీని వీడతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘బీజేపీతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు నేను పార్టీలో చేరా. అలాంటిది పార్టీని ఎందుకు వదిలేస్తా. మోదీ, ముఖ్య నేతలు, చివరికి తన కూతురు(నటి సోనాక్షి సిన్హా) సహకారం లేకుండా ఎన్నికల్లో గెలిచా. కానీ, ప్రస్తుతం పార్టీలో కొందరి పెత్తనం కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం బిహార్ ఎన్నికల సమయంలో తన సేవలను వినియోగించుకుంటారేమోనని అమిత్‌ షాను కలిశా.. కానీ, అటు నుంచి సానుకూలత రాలేదు. ఇక ఈ మధ్య ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎంతో ప్రయత్నించా. కనీసం పట్టించుకోను లేదు. అయినప్పటికీ నాకేం బాధలేదు. నన్ను నిర్లక్ష్యం చేసినా కడదాకా పార్టీతోనే ఉంటా’ అని సిన్హా స్పష్టం చేశారు.  

ఇక సీనియర్‌ నేత అద్వానీ గురించి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన(అద్వానీ) నా గురువు, మార్గదర్శి. ప్రధాని అభ్యర్థిత్వానికి మోదీ తగిన వ్యక్తి కాదని ఆనాడూ(2013లో) అద్వానీతో సహా తాను గళం వినిపించానని కానీ పార్టీ అధిష్టానం ఆ అంశాన్ని పక్కన పెట్టిందని గుర్తుచేశారు. అంతేకాదు అద్వానీ రాష్ట్రపతి కావాలని బీజేపీలోని 80 శాతం మంది కోరుకున్నారని.. కానీ, కొందరు ఆ అంశాన్ని లేవనెత్తనీయకుండా అణచివేశారని సిన్హా చెప్పారు.  


జీఎస్టీతో ఇబ్బందులే... 

మోదీ ప్రభుత్వ నిర్ణయాలపై సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు శతృఘ్న సిన్హా తెలిపారు. నోట్ల రద్దు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిదన్న ఆయన జీఎస్టీతో బీహార్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని బీహార్  ప్రజలు అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పేదలు, వ్యాపారవేత్తల్లో భయాందోళనలు రేకెత్తించిందని ఆరోపించారు. 

మధ్య తరగతి కుటుంబాలు, యువతరం, నిరుద్యోగం, చిన్న వ్యాపారులు, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. బీహార్ ప్రజలు ఇప్పటికీ ఈ సమస్యల నుంచి బయటపడలేదని, జీఎస్టీ అంటే ‘గెయిల్ సర్కార్ తొహార్ (ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది) అని సిన్హా సరికొత్త భాష్యం చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement