మేనిఫెస్టోను విడుదల చేస్తున్న ఉద్ధవ్, ఆదిత్య
సాక్షి ముంబై: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టే రూ. 10కే భోజనం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఒకే వంటశాలలో తయారుచేసిన భోజనాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలను కూడా ఇందులో చేర్చుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇళ్లలో వినియోగించే విద్యుత్ చార్జీలలో 300 యూనిట్ల వరకు వచ్చే బిల్లులపై 30 శాతం రాయితీ కల్పించనున్నట్టు ప్రకటించారు.
ఆరోగ్యం..విద్య..
ప్రజలకు అందుబాటులో లేని 200 రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కేవలం ఒక్క రూపాయికే అందించనున్నట్లు తెలిపారు. పేద రైతులకు ప్రతి సంవత్సరం రూ.10వేలు నేరుగా అకౌంట్లో జమ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 15 లక్షల పట్టభద్రులైన యువకులకు ‘యువ ప్రభుత్వం ఫెలో’ ద్వారా స్కాలర్‌షిప్ అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల నుంచి పాఠశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. విద్యార్థులందరికి మానసిక, శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేత గురించి మేనిఫేస్టోలో లేదు.
Comments
Please login to add a commentAdd a comment