సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయం రసవత్తరమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కును విజయవంతంగా దాటగలిగింది. కానీ, అనుకున్నట్టుగా బీజేపీ భారీగా స్థానాలు సాధించలేకపోయింది. కాషాయ పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గగా.. దాని మిత్రపక్షం శివసేన తన స్థానాలను మెరుగుపరుచుకొని.. రియల్ కింగ్‌మేకర్‌గా అవతరించింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ గతంలో కంటే గణనీయంగా తన స్థానాలను పెంచుకుంది. ఫలితాల్లోని ఈ పరిణామాలు సహజంగానే అధికార బీజేపీపై హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కూటమితో శివసేన అధికారాన్ని పంచుకోవచ్చునని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ ఊహాగానాలను కొట్టిపారేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పిన ఆయన.. అందులో ఓ మెలిక పెట్టారు. గతంలో మాదిరిగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇచ్చేది లేదని సంకేతాలు ఇచ్చారు. సంకీర్ణ కూటమిలో భాగంగా అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామని, ఆ ప్రకారంగానే ప్రభుత్వం ఉండబోతున్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. అటు థాక్రేల వారసుడు ఆదిత్యా థాక్రే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి.. వర్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపు దిశగా సాగుతున్నారు. మహారాష్ట్రలో థాక్రేల పాలన రావాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబడుతోంది. ఆదిత్య థాక్రేను సీఎంగా చూసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా అందుకు సానుకూల సంకేతాలే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పదవిలో ఫడ్నవిస్ రానున్న ఐదేళ్లూ కొనసాగుతారా? లేక శివసేనతో ఆ పదవిని పంచుకుంటారా? ఆదిత్య థాక్రే సీఎం అవుతురా? అన్నది ఆసక్తి రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment