నిరసనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక యుగానికి తగ్గట్లుగా మెరపు నిరాహార దీక్షలు వచ్చాయి. మన కాలానికి కనుగొన్న గొప్ప రాజకీయ సృజనాత్మకాయుధం ఇదే కావచ్చు. ఈ ఆయుధం వల్ల చూసే వారికి బాధ కలగదు. చేసే వారికి బాధ కలకదు. ఉదయం ప్రారంభమై సాయంత్రానికల్లా ముగిసే మెరపు నిరాహార దీక్షల వల్ల ప్రచారం లభించినా ప్రయోజనమే కదా! పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపచేసినందుకు నిరసనగా గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒక రోజు కాదు, ఒక పగలు నిరాహార దీక్షలు చేశారు.
‘అబ్బా ! ఇది ఎంత బాగుందీ. ఒక్కరోజు నిరాహార దీక్ష, అందులోనూ ఆయనకు వ్యతిరేకంగానే’ అంటూ మోదీ దీక్షపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దేశంలో పెరిగిపోతున్న కుల, మత హింసాకాండకు వ్యతిరేకంగా పుష్టిగా టిఫిన్ చేసి సాయంత్రం వరకు మెరపు నిరాహార దీక్షలు చేశారు. వాస్తవానికి అన్నింటికీ తానే ఆద్యుడిని అని చెప్పుకునే నరేంద్ర మోదీకే ఈ మెరుపు నిరాహార దీక్షలు కనుగొన్న ఘనత కూడా దక్కుతుందని చెప్పవచ్చు.
మోదీ 2011లో గుజరాత్‌లో హిందూ, ముస్లింల మధ్య ఐక్యత కోసం ‘సద్భావన’ నిరాహార దీక్ష చేశారు. ముందుగా ప్రకటించిన మూడు రోజుల నిరాహార దీక్షను ఆయన ముందుగానే ముగించారు. అదే సమయంలో అన్నా హజారే దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరాహార దీక్షను చేపట్టారు. ఆయన మూడు డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో 12 రోజుల తర్వాత ఆయన తన దీక్షను ముగించారు. 2006లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మమతా బెనర్జీ కూడా సింగూర్ ల్యాండ్ వివాదంపై ఏకంగా 26 రోజులు నిరాహార దీక్ష చేశారు.
నిరాహార దీక్ష అనేది దేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులపై మహాత్మా గాంధీ ప్రయోగించిన ఆయుధంగా పేర్కొనవచ్చు. నిష్టాగరిష్టంగా నిరాహార దీక్ష చేయడం వల్ల ఆత్మ శుద్ధితోపాటు పర శుద్ధి కలుగుతుందని గాంధీ విశ్వసించేవారు. ఆత్మవికాసంతోపాటు పరులు లేదా వ్యతిరేకులు భయపడి పోతారని భావించేవారు. స్వాతంత్య్ర పోరాటంలో సత్యాగ్రహం పేరిట నిరాహార దీక్ష నిర్ణయాత్మక పాత్ర పోషించింది. నాటి నుంచి నేటి వరకు ఇది సామాజిక సంస్థలకు ప్రధాన ఆయుధంగా ఉంటూ రాగా, ఇటీవలి కాలంలో రాజకీయ ఆయుధంగా కూడా మారింది. ఏదేమైనా ఆశించిన లక్ష్యం కొంత మేరకైనా నెరవేరే వరకు ఈ రాజకీయ దీక్షలు కొనసాగేవి. ప్రస్తుతం ప్రచారానికే పరిమితం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment