సిద్దరామయ్య రూటే సెపరేటు | Siddaramaiah New Agenda For Karnataka Elections | Sakshi
Sakshi News home page

సిద్దరామయ్య రూటే సెపరేటు

Published Wed, Mar 14 2018 9:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Siddaramaiah New Agenda For Karnataka Elections - Sakshi

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

సాక్షి, బెంగుళూరు : కర్ణాటక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏడాది కాలంగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ జాతీయవాదానికి దీటుగా కన్నడ ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తూ సమరాంగణంలో సవాలు విసురుతున్నారు. కాషాయపక్షం వ్యూహాలకు దీటైన రీతిలో ఆయన జవాబిస్తున్నారు. బెంగళూరు మెట్రో రైల్‌ నమ్మ మెట్రో సైన్‌ బోర్డుల్లో హిందీ మాటలు తొలగించాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు ఆయన కిందటేడాది లేఖ రాశారు.

రాష్ట్రంలో కన్నడ భాష విషయంలో తమిళుల మాదిరిగా ఆత్మగౌరవం అంశాన్ని ముందుకు తెచ్చి మెజారిటీ కన్నడిగుల ఆదరణ సంపాదించాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. దాదాపు 28 ఏళ్లు కాంగ్రెసేతర పార్టీల్లో కొనసాగినా 2006లో కాంగ్రెస్‌లో చేరిన ఏడేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సిద్దరామయ్య రాజకీయ ఎత్తుగడలకు, సామర్ధ్యానికి అద్దంపడుతోంది.

కర్ణాటకకు ప్రత్యేక జెండా!
అలాగే కన్నడిగుల ‘అస్మిత’, ఉనికిని చాటిచెప్పేలా సిద్దరామయ్య సర్కారు కర్ణాటకకు ప్రత్యేక జెండా ప్రతిపాదన చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులేవైనా ఉన్నాయా? అనే విషయం పరిశీలకు కిందటి డిసెంబర్లో నిపుణలతో ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అందుకు పచ్చ జెండా చూపించాక ప్రభుత్వం జెండా రూపొందించింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 370 అధికరణ వల్ల జాతీయ పతాకంతో పాటు రాష్ట్ర జెండా ఎగురవేసే అవకాశం ఒక్క జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి మాత్రమే ఉంది. కన్నడిగుల స్వాభిమానానికి సంబంధించిన ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడదంటూ సిద్దరామయ్య ప్రశ్నించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు.

వీరశైవులకు ప్రత్యేక మతంగా గుర్తింపు!
రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో పెద్దదైన లింగాయత్‌లను(జనాభాలో 10 శాతం) కాంగ్రెస్‌వైపు మళ్లించడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు ఉత్తర కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. లింగాయత్‌లందరూ ఏకాభిప్రాయంతో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరితే, తాను ఈ కోర్కె తీర్చాలని కేంద్రానికి సిఫార్సు చేస్తానని సిద్ధరామయ్య హామీ ఇవ్వడంతో ఈ సామాజికవర్గంలో కదలిక మొదలైంది. లింగాయత్‌లు మరో వ్యవసాయాధార సామాజికవర్గం వొక్కళిగలతో పాటు వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జాబితాలో ఉన్నారు.

అయితే, తాము హిందూ సమాజంలో అంతర్భాగం కాదని, తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని లింగాయత్‌లలో కొందరు చాలా ఏళ్ల క్రితమే డిమాండ్‌చేశారు. ఉత్తర కర్ణాటకలో ఇటీవల వరుసగా అనేకచోట్ల ఈ డిమాండ్‌పై వేలాది మందిని సమీకరించి సమావేశాలు నిర్వహించారు. తొలుత వీరశైవులు, లింగాయత్‌లు అనే రెండు వర్గాలుగా ఉన్న జనం ఇటీవల లింగాయత్‌లనే పేరుతో కలిసిపోయారు. చివరి కాంగ్రెస్‌ లింగాయత్‌ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్‌ను పదవిలో ఏడాది కూడా పూర్తి చేయకుండానే 1990లో కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం తొలగించింది.

అప్పటి నుంచీ ఈ సామాజికవర్గం నెమ్మదినెమ్మదిగా బీజేపీకి దగ్గరవుతూ వస్తోందని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ మాజీ సీఎంలు బీఎస్‌ యెడ్యూరప్ప, జగదీశ్‌ షెట్టర్‌లు లింగాయత్‌లే. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలని నిపుణుల కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్ట్ర కేబినెట్‌వెంటనే ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరుతూ ఇటీవల లింగాయత్‌లు అధిక సంఖ్యలో ఉండే కలబురగిలో జగతిక లింగాయత మహాసభ నిరవధిక ప్రదర్శన ప్రారంభించింది. ఈ సిఫార్సును అంగీకరించేదిలేదని బీజేపీ నేత యెడ్యూరప్ప ప్రకటించారు.

మహదాయి జలాలపై వివాదం
వాయవ్య కర్ణాటకలో ఎప్పుడూ మంచినీటి కొరత ఎదర్కునే బెళగావి, విజయపుర సహా ఆరు జిల్లాల అవసరాలు తీర్చడానికి మహదాయి నది నుంచి 7.56 శతకోటి ఘనపుటడుగుల నీటిని తరలించడానికి ఉపనదులైన కలస, బందూరిలను అనుసంధానం చేయాలన్న 16 ఏళ్ల నాటి డిమాండ్‌ను ఇప్పుడు సిద్దరామయ్య మళ్లీ తెరపైకి తెచ్చారు. గోవాలో మాండోవిగా పిలిచే మహదాయి నీటి తరలింపునకు అక్కడి బీజేపీ సర్కారు సుముఖంగా లేకపోవడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. 2002లోనే కేంద్రంలోని ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వం కర్ణాటక ప్రతిపాదనకు ఆమోదముద్రవేసింది. తమిళనాడుతో నిరంతరం వివాదాలకు కారణమైన కావేరీ జలాల పంపిణీ విషయంలో కూడా సిద్దరామయ్య కర్ణాటక ప్రయోజనాలు కాపాడుతున్నారనే ‘ఇమేజ్‌’ సంపాదించారు.

భాషాభివృద్ధి నినాదంతో రాజకీయ జీవితం ప్రారంభం
సోషలిస్ట్‌నేత రామ్‌మనోహర్‌లోహియా స్ఫూర్తితో సిద్దరామయ్య మొదట మాతృభాషాభివృద్ధికి కన్నడ కావలు సమితి అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ప్రస్తుత రూపంలో కర్ణాటకగా అవతరించడానికి ముందు బొంబాయి కర్ణాటక, హైదరాబాద్‌కర్ణాటక, మద్రాస్‌కర్ణాటక, మైసూరు అనే నాలుగు పాలనా విభాగాలుగా ఉన్న కారణంగా కన్నడిగులకు భాష విషయంలో స్వాభిమానం ఎక్కువ.

అందుకే కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇటీవల కన్నడ రక్షణ వేదిక నుంచి వినతిపత్రం అందుకోవడానికి తన మంత్రివర్గసభ్యుడు ఎం.కృష్ణప్పను బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌కు పంపించారు. కన్నడ అనుకూల వైఖరి అవలంబించడానికి కారణం కేవలం బీజేపీ అసలు స్వరూపం బయట పెట్టడమే కాదని, జేడీఎస్‌వంటి ప్రాంతీయపక్షాన్ని కట్టడి చేయడానికి కూడా అది ఉపకరిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆదిత్యనాథ్‌కు సలహా!
కిందటేడాది కర్ణాటక పర్యటనకు వచ్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. వాటికి సిద్దరామయ్య ట్విటర్‌ద్వారా దీటైన జవాబు ఇచ్చారు. ‘‘ యూపీ సీఎంను మా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. మీరు ఇక్కడ ఉండగా ఇందిరా క్యాంటీన్లు, రేషన్‌షాపులు చూడండి. అలా చేస్తే మీ రాష్ట్రంలోని ఆకలి చావులు నివారించవచ్చు’’ అని సిద్దరామయ్య ఘాటుగా సమాధానమిచ్చారు.

అలాగే, కిందటి జనవరిలో మహదాయి జలాలను కర్ణాటక ప్రజలు దొంగచాటుగా వాడుకుంటున్నారంటూ గోవా నీటి వనరుల మంత్రి వినోద్‌పలియెంకర్‌విలేకరుల సమావేశంలో ఆరోపించిన సందర్భంలో కన్నడిగులను ‘హరామీ’ (ద్రోహులు)అని వర్ణించారు. అప్పుడు కూడా సిద్దరామయ్య గట్టిగా స్పందించి నదీ జలాలపై కన్నడిగులకున్న హక్కును తేల్చి చెప్పారు.  
(సాక్షి నాలెడ్జ్ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement