గోధుమ పంట కోస్తున్నట్టు ట్విట్టర్‌లో ఫొటోలు
హేమమాలిని. బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్. ఏడు పదులు దాటినా వన్నె తరగని అందం. ఎన్నికలొస్తున్నాయ్ కదా. సినీ గ్లామర్ అన్ని వేళలా ఓట్లు కురిపించదని ఆమెకు బాగా తెలుసు. ఉత్తరప్రదేశ్‌లో మ«థుర నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె ఏప్రిల్ 1న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మథురకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవర్థన్ వ్యవసాయ క్షేత్రంలో మహిళా కూలీలతో కలిసి గోధుమ పంటల్ని కోశారు. కాసేపు వారితో ముచ్చట్లాడారు. ఆ ఫొటోలన్నీ ట్విట్టర్‌లో షేర్ చేస్తే 14 వేల లైక్‌లు దాటిపోయాయి. తమ కలల రాణి మండుటెండల్లో చెమట్లు కక్కుతూ పని చేయడంతో కందిపోయిన ఆ ముఖారవిందాన్ని చూసి కొందరు అభిమానుల హృదయాలు జాలితో ఉప్పొంగాయి. ఆ ఫొటోలకు లైక్‌లపై లైక్‌లు కొట్టారు. అయితే చాలామంది నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేశారు. ‘ఇక నటించింది చాలు. నియోజకవర్గం సంగతి చూడండ’ంటూ చురకలంటించారు.
కలల రాణి.. వివాదాల వాణి
♦ శ్రీ కృష్ణుడి జన్మస్థానమైన మథుర నియోజకవర్గం నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో హేమమాలిని గెలుపొందారు. ఈ అయిదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమె ఏమీ చెయ్యకపోగా పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.
♦ 2016లో మథురలో పోలీసులకు, కబ్జాదారులకు మధ్య ఘర్షణలు జరిగి. 24 మంది ప్రాణాలు కోల్పోయి రక్తం ఏరులై పారితే అదే సమయంలో ఆమె సినిమా షూటింగ్‌లో ఉన్నారు. పైపైచ్చు ‘నేను ఒక ఆర్టిస్టుని. సినిమా షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నా. ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చాను. సినిమా విడుదల ఆగిపోకూడదు. మథురలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం’ అంటూ ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు. అది వివాదాస్పదం కావడంతో అధిష్టానం హేమమాలినిపై సీరియస్ అయింది. దీంతో హేమ ఆ ట్వీట్‌ను తొలగించి మర్నాడే నియోజకవర్గానికి వచ్చి బాధితుల్ని పరామర్శించారు.
♦ మథుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా హేమమాలిని ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమమాలినికి గాయాలయ్యాయి. ఎదురు కారులో ఉన్న నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. హేమమాలినిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందించిన ఆమె అనుచరగణం ప్రమాదంలో గాయపడిన సామాన్యుల్ని పట్టించుకోలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత హేమమాలిని.. ఆ కుటుం బాన్ని పరామర్శించకపోగా ఆ బాలుడి తండ్రిదే తప్పన్నట్టు మాట్లాడారు. ఆయన ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని దుయ్యబట్టారు. ఈ ఘటన కూడా అప్పట్లో వివాదాస్పదమైంది.
♦ ముంబైలోని అత్యంత ఖరీదైన అంధేరి ప్రాంతంలో తన డ్యాన్స్ అకాడమీ నాట్య విహార్ కేంద్ర చారిటీ ట్రస్ట్ కోసం కారుచౌకగా భూమి సంపాదించారన్న ఆరోపణలున్నాయి. రూ.50 కోట్ల విలువైన ఆ భూముల్ని హేమమాలిని అక్రమ మార్గాల్లో రూ.70 వేలకే పొందారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
పార్లమెంటులో హాజరు అంతంత మాత్రం
లోక్‌సభ ఎంపీగా నియోజకవర్గం సమస్యలు ఏమైనా లేవనెత్తారా అంటే అదీ లేదు. లోక్‌సభలో హేమమాలిని హాజరు శాతం 39 శాతమే. ఇది జాతీయ సగటు హాజరు (80 శాతం) కంటే చాలా తక్కువ. ఈ అయిదేళ్లలో కేవలం 17 చర్చల్లో పాల్గొన్నారు. (జాతీయ సగటు 67 చర్చలు)
పొలాల్లో చెమటోడిస్తే ఓట్ల పంట పండుతుందా?
హేమమాలిని మథురలో ఏటికి ఎదురీదుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆమె నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేదన్న అసంతృప్తి స్థానికుల్లో ఉంది. ‘సినీతారలు పనెక్కడ చేస్తారు. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేరుగా గెస్ట్‌హౌస్‌కి వెళ్లిపోతారు. ప్రజల సమస్యలు పట్టించుకోరు. తాగునీటి సమస్య ఉంది. పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాలు లేవు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే కృష్ణుడి జన్మస్థానంలో అన్నీ సమస్యలే’ అని కొందరు స్థానికులు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి హేమమాలిని పాల్గొన్న ర్యాలీలకు జనం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆమెకు టికెట్ మళ్లీ ఇవ్వరాదనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఎలాగోలా టికెట్ దక్కించుకున్నప్పటికీ డ్రీమ్ గర్ల్‌కి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురవుతోంది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ పొత్తులో భాగంగా మథుర స్థానాన్ని ఆర్‌ఎల్డీకీ కేటాయించారు. ఆ పార్టీ నుంచి కన్వర్ నాగేంద్రసింగ్ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మహేశ్ పాఠక్ పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోటీలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కలల రాణికి ఈ ఎన్నికలు కల్లలుగా మారుతాయనే ప్రచారమైతే సాగుతోంది.
ట్రోలింగ్ ఇలా...
♦ మీరు డ్రీమ్ గర్లా, డ్రామా గర్లా?
♦ ఈ ఫొటోలు ట్విటర్‌లో పోస్టు చేయడానికి సరైన సమయాన్ని ఎంచుకున్నారు. ఇవాళ ఏప్రిల్ ఫస్ట్. అంటే ఏంటో తెలుసు కదా!
♦ అయిదేళ్ల కిందట నుంచి ఇలా పని చేసి ఉంటే మీరే విజేతగా నిలిచి ఉండేవారు. ఆల్ ది బెస్ట్.
Comments
Please login to add a commentAdd a comment