సాక్షి, నెల్లూరు: ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీ నేతలపై నోరుపారేసుకునే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ప్రత్యక్ష ఎన్నికలు కలిసిరావడంలేదు. ప్రజాక్షేత్రంలో ఆయనకు విజయలక్ష్మి కరుణ కరువైంది. ఆయనకు ఎన్నికల్లో విజయం అందని ద్రాక్ష అయింది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి చేపట్టి దొడ్డిదారిన మంత్రి అయ్యారు. నాలుగేళ్ల కాలంలో ఆయన జిల్లాకు చేసిందేమీలేదు. వ్యక్తిగతంగా మాత్రం లాభపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను, ప్రత్యర్థి పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేసినా ఆయనకు విజయం దక్కలేదు. వరుసగా ఐదోసారి ఎన్నికల రణరంగంలో ఓటమిపాలై సోమిరెడ్డి రికార్డు సృష్టించారు.
‘సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మారు.. నేను తప్పక ఎమ్మెల్యేగా విజయం సాధిస్తా.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా.. త్వరలో జరగబోయే ఎన్నికల్లోగెలిచి నా సత్తా చూపిస్తా’ అంటూ సోమిరెడ్డి బీరాలు పలికారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి ఓటర్లు మాత్రం ఆయనకు బైబై చెప్పేసి ఇంటిబాట పట్టేలా చేశారు. నెల్లూరు రాజకీయ చిత్రపటంలో ఇప్పటికే ఐదుసార్లు వరుస ఓటమిలతో డబుల్ హ్యాట్రిక్‌కు చేరువైన సోమిరెడ్డి ప్రజల మనస్సులు గెలుచుకోవడంలో వెనుకబడిపోయారు. ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదులుకొని, ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సోమిరెడ్డికి తీవ్రశృంగభంగమైంది.
ఐదోసారీ..
నెల్లూరు టీడీపీలో కీలకనేతగా ఎదిగిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజకీయ చాణుక్యుడిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నెల్లూరులో టీడీపీలోనే కొనసాగుతూనే వచ్చారు. గతంలో పార్టీకి గడ్డుకాలం ఎదురైన రోజుల్లో అన్నీతానై వ్యవహరిస్తూ వచ్చిన సోమిరెడ్డికి చంద్రబాబు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించి కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ మితిమీరిన అహంకారం ఆయనకు శాపంగా మారి ఆ పార్టీలోనే శత్రుత్వం పెరిగింది. ఆ అహంకారమే ప్రజల్లో చులకన చేసింది. దీంతో ఆయనకు వరుస ఓటములు తప్పలేదు. 1994లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై విజయం సాధించారు. 1999లో కూడా అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై విజయం సాధించి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి జిల్లా అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక మార్కు వేయలేకపోయారు. ఆపై అతనిని వరుస ఓటములే వెంటాడాయి. 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో పోటీపడి ఓటమి చెందారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంతో నెల్లూరు జిల్లా ఆ పార్టీకి అండగా నిలిచిన నేపథ్యంలో 2012లో జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థి కరువవ్వడంతో ఆయనే బరిలో నిలిచి తన సమీప బంధువు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆపై 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోటీచేసి వరుస పరాజయాలను మూటకట్టుకున్నారు.
మంత్రిగా అవినీతిముద్ర
2014 ఎన్నికల్లో ఓటమి చెందిన సోమిరెడ్డి పార్టీలో కూడా పట్టుకోల్పోయారు. బీద బ్రదర్స్ హవా కొనసాగుతుండడంతో ఆయనకు ఇబ్బందిగా మారింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన పైరవీలు చేసుకోవాల్సివచ్చింది. అలాగే మంత్రి పదవికి కూడా తీవ్ర పోటీ ఉండడంతో బీజేపీ అగ్రనేతగా ఉన్న వెంకయ్యనాయుడు సిఫార్సుతో మంత్రి పదవి దక్కించుకొని జిల్లాలో అవినీతి మార్కు వేశారు. జిల్లాలో సహజ వనరుల దోపిడీ నుంచి రైతురథంలో కమీషన్లు, ఉపాధిలో దోపిడీ, ఇరిగేషన్ పనుల్లో అక్రమాలతో నిత్యం వార్తల్లో నిలిచారు. అధికారదర్పంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినా ఆయన మాత్రం ఎదురొడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారికి భరోసా నిచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో అవినీతికి కేరాఫ్‌గా నిలచిన సోమిరెడ్డిని సర్వేపల్లి ఓటర్లు టాటా చెప్పి ఇంటికే పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment