కూర్చునేందుకు సీట్ల లేకపోవడంతో స్టేజీ ముందే నిలబడి ఉన్న అధికారులు
నెల్లూరు, తోటపల్లిగూడూరు: ‘లేడికి లేచిందే పరుగన్నట్లు’.. మంత్రి సోమిరెడ్డికి ఆదివారం పూట తీరిక దొరకడంతో అధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఇక్కడికీ సరే అనుకున్నా.. అధికారులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టి, అధికారులను నిలబెట్టి వారిని అవమానించారు. సాధారణంగా ఎమ్మెల్యే, మంత్రి అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశమంటే ప్రజాప్రతినిధులతో పాటు మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ ఫలాలు, పాలనా పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షిస్తారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు మినహా ఇతరులకు ఎవరికీ అవకాశం ఉండదు. అయితే ఆదివారం తోటపల్లిగూడూరు మండల పరిషత్ సమావేశం మందిరంలో రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం పార్టీ కార్యక్రమంలా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
సమావేశానికి ముందు రోజే ఆదివారం జరిగే సమావేశానికి రావాలని కార్యకర్తలకు టీడీపీ పార్టీ మండల కమిటీ పిలునివ్వడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మండల కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సోమిరెడ్డితో పాటు అర్హత లేని పలువురు టీడీపీ నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. 150కు మించి సీట్లు పట్టని మండల పరిషత్ కార్యాలయంలో 130కు పైగా కుర్చీలను అధికార పార్టీ కార్యకర్తలే ఆక్రమించుకున్నారు. దాదాపు 50 మంది అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉండగా అందులో కుర్చీలు 20 మందికే దొరికింది. మిగిలిన 30 మంది కొందరు మంత్రి సమావేశ వేదిక ముందు, మరి కొందరు పార్టీ కార్యకర్తల వెనుక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ అధికార సమావేశం మందిరంలో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రైవేట్ వ్యక్తుల హల్‌చల్ చేస్తుంటే అధికారులు నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. అవినీతి అక్రమాల్లో చేతులు కలపని అధికారులపై అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం సదరు అధికారులు జీర్ణించుకోలేకపోయారు. ఇది ఇలా ఉంటే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులు భారీ సంఖ్యలో కుర్చీల్లో ఆసీనులైనా ఆర్డీఓ కానీ, మండల అధికారులు ఎంపీడీఓ, తహసీల్దార్లు గాని మంత్రికి భయపడి నోరెత్తకపోవడం గమనార్హం. అయితే మంత్రి తీరుపై కొందరు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది బాహటకంగానే విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment