
టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. విజయవాడలో సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..వారసత్వ రాజకీయాలు గురించి మాట్లాడే పవన్ కల్యాణ్, తన అన్న వారసత్వం నుంచి రాజకీయాల్లోకి, సినిమాల్లోకి రాలేదా అని సూటిగా ప్రశ్నించారు.రాష్ట్రంలో చాలా మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.. వాళ్ల కొడుకు ఎవరైనా సీఎం కావొచ్చు అని పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు చురకలంటించారు.రెండు సార్లు అఖిలపక్షం పెట్టి ఆహ్వానిస్తే ఎందుకు రాలేదని సూటిగా అడిగారు. ఇప్పుడు మళ్లీ అఖిలపక్షం పెట్టమని పవన్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం మొత్తం ఉంటే, పవన్ కవాతు చేస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ మీద పవన్ కవాతు ఎందుకు చేశాడో చెప్పాలని సూటిగా అడిగారు. కవాతుకు అన్ని కోట్ల రూపాయల డబ్బులు పవన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కమెడియన్స్ వచ్చినా జనం తండోపతండాలుగా వస్తారని వ్యాక్యానించారు.
ఇంకా మాట్లాడుతూ..‘ ప్రజలు తనను సినిమా హీరోగా చూస్తున్నారా లేక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా అనేది పవన్ ఆలోచించుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎలా అవుతారంటూ పవన్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. పవన్ లెక్క ప్రకారం బిల్ కలెక్టర్‌గా పని చేస్తేనే జిల్లా కలెక్టరుగా పని చేయాలేమో.ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీ చేస్తాననడంలోనే పవన్ రాజకీయ పరిణతి ఏంటో అర్ధం అవుతోంద’ని విమర్శించారు.
‘తోలు తీస్తా..తాట తీస్తా..గోదాట్లో కలిపేస్తా.. అంటూ ఈ తరహా భాష ఏ రాజకీయ పార్టీ ఉపయోగించదు. ఈ భాషనే పవన్ తన మేనిఫెస్టోలో పెడతారా..? మంచిని మంచి అనడం..తప్పులేమైనా ఉంటే చెప్పడం పవన్ అలవాటు చేసుకోవాలి. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క సభ అయినా పవన్ నిర్వహించారా? వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కు తీసుకుంటే పవన్ మాట్లాడారా. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పటి వరకు తాను చేసి కామెంట్లను పవన్ విశ్లేషించుకోవాలి. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి కూడా కాంగ్రెస్‌కు దూరమయ్యారనే వార్తలు వస్తున్నాయ’ని సోమిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment