
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం అవసరమే అయినప్పటికీ అమలు విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికారహితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆక్షేపించారు. కేంద్రం తీరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వలస కూలీలు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, నేతలు రాహుల్ గాంధీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా మహమ్మారి వల్ల పేదలు, బలహీనులే ఎక్కువగా ఇక్కట్ల పాలవుతున్నారని సోనియా గాంధీ పేర్కొన్నారు. లక్షలాది మంది వలస కూలీలు వందలాది కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు తనను కలచివేస్తున్నాయని చెప్పారు. వారికి కనీసం కడుపునిండా ఆహారం కూడా అందించకపోవడం బాధాకరమన్నారు. ఈ పరిస్థితికి కేంద్రమే కారణమని ఆరోపించారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి అత్యాధునిక రక్షణ పరికరాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని సోనియా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment