ఎలక్షన్ పొత్తులకు మొక్కజొన్న పొత్తులకు సామ్యం ఉంది. మొక్కజొన్న పొత్తును అర్థం చేసుకుంటే ఎన్నికల పొత్తుల ఎత్తులూ జిత్తులూ కసరత్తుల గురించీ అర్థమవుతుంది.
మొదట మొక్కజొన్న పొత్తు తీరు... ఆ గింజల విన్యాసాన్ని ఒకసారి చూద్దాం. మొక్కజొన్న కండెపై మంచి ఆకర్షణీయమైన రంగులో గింజలు పేర్చినట్టుంటాయి. కానీ కండె చివర సన్నటి భాగంలో మాత్రం గింజలు చిన్నవిగానూ, దూరంగా చెదిరినట్టుగానూ ఉంటాయి. తినడానికి అంత అనువుగా ఉండవు.
కొన్ని నియోజకవర్గాలూ అంతే. కొందరికి అంతగా ప్రాధాన్యం లేనివిగా అనిపిస్తాయి. గెలుపునకు అనువుగా అనిపించవు. కొంతమంది అభ్యర్థులకు ఆ స్థానాల్లో షూర్ విన్ ఛాన్సెస్ ఉండకపోవచ్చంటూ అంచనాలుంటాయి. అనుమానాలుంటాయి. విశ్లేషణలుంటాయి. దాంతో వివాదాలొస్తాయి.
ఇప్పుడు మళ్లీ మొక్కజొన్నపొత్తులోని మధ్యలో ఉండే గింజలను చూద్దాం. అక్కడవి చాలా ఆకర్షణీయంగా, దట్టంగా ఉంటాయి. తినడానికి అనువుగానూ ఉంటాయి. వీటిని నియోజకవర్గాలకు అన్వయిస్తే అవి గెలుపునకు కేక్‌వాక్ స్థానాలనుకోవచ్చు.
ఒకే కండెను ముగ్గురు పంచుకొని తినాలనుకోండి. వాటాల దగ్గర గొడవలైపోతుంటాయి. కండెలోని మొదలు భాగం లేదా చివర ఉండే సన్నటి భాగం మాకొద్దంటే మాకొద్దంటూ భాగస్వాములు అంటారు. మంచిగా ఉన్న మధ్యభాగమే కావాలని పట్టుబడతారు. ఏతావాతా తేలేదేమంటే ఎలక్షన్ పొత్తయినా, మొక్కజొన్న పొత్తయినా భాగస్వాముల మధ్య తగాదాలు తప్పవన్నమాట. కొంత ఘర్షణ తర్వాత భాగస్వాముల బలాన్ని బట్టి ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. కానీ ఒక్కోసారి వాటాలన్నీ పూర్తయిపోయాక్కూడా తమకు దక్కింది గింజల్లేని తెల్లటి కండేనని కొందరికి అనిపించవచ్చు. దాంతో ఎంతటి ఉత్తములకైనా తాము మోసపోయామనే ఉడుకుమోత్తనం రావచ్చు. ఇలాంటప్పుడు ఎదుటివాడికి చేతికందిన దాన్ని నోటికి అందకుండా ప్రయత్నాలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితే పొత్తుమిత్రుల మధ్య వస్తే.. అప్పుడు ఎంతటి మిత్రులైనా సదరు నియోజకవర్గంలో పోటీకి ఎదురెదురు నిలబడతారు. ఇదేమిటని ఎవరైనా అంటే ఇది ‘స్నేహపూర్వక పోటీ’ అనో మరొకటనో అంటారు.
ఇది పొత్తుల గురించి ఒక అనుభవశాలి ఉవాచ.
‘పొత్తు’ అని పేరుపెట్టుకున్నందుకు మొక్కజొన్న కండెలో ఇంతటి ఎన్నికల విజ్ఞానం దాగుందా అని ఒకాయన ఆశ్చర్యపోయాడట.
మొక్కజొన్న‘పొత్తులు’
Published Sat, Nov 3 2018 4:01 AM | Last Updated on Sat, Nov 3 2018 4:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment