
మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్‌లో కలకలం రేగింది.
భోపాల్: మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్‌లో కలకలం రేగింది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని వచ్చిన వదంతులతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హిందీ దినపత్రిక ‘నవభారత్ టైమ్స్’ లక్నో రెసిడెంట్ ఎడిటర్ సుధీర్ మిశ్రా దీని గురించి ఈ ఉదయం ట్వీట్ చేయడంతో ఈ వదంతులు వ్యాపించాయి. ‘బ్రేకింగ్ న్యూస్: మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాకు సన్నిహితులైన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వారందరూ రెండు రోజుల నుంచి ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింద’ని ఆయన ట్వీట్ చేశారు. తర్వాత గంటలోపు ఈ ట్వీట్‌ను తొలగించారు. అయితే ఈ ట్వీట్ అందరికీ చేరిపోవడంతో చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వెంటనే దీనిపై స్పందించింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పనితీరుపై సింధియా, ఆయన మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారని, ఏదోక సమయంలో వీరంతా తిరుగుబాటు చేసే అవకాశముందని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేశ్ వాజపేయి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారని వచ్చిన వార్తలను జ్యోతిరాదిత్య సింధియా కొట్టిపారేశారు. ‘ఈ వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఎవరు అదృశ్యమయ్యారో చెప్పండి. వాళ్లతో మాట్లాడిస్తాన’నని అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో సింధియా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వచూపినా తిరస్కరించారు. అప్పటి నుంచి కమల్‌నాథ్ సర్కారుతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా వదంతులు వచ్చాయి. (చదవండి.. ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా)