డీల్‌ కుదిరింది!  | srinath reddy changed the words about party change | Sakshi
Sakshi News home page

డీల్‌ కుదిరింది! 

Published Tue, Dec 12 2017 10:27 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

srinath reddy changed the words about party change - Sakshi

పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్‌రెడ్డి గంటల వ్యవధిలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు. వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నానంటూ సంకేతాలు పంపి తర్వాత కాదని ఎందుకు మాట మార్చారు.. ఇంతలా ఆయన్ను ప్రభావం చేసిన అంశాలేంటి అని పరిశీలిస్తే ఈ తతంగం వెనుక పెద్ద హైడ్రామానే నడిచింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి ‘తాయిలాలు’ ప్రకటించారనే అంశం ఇప్పుడు గుప్పుమంటోంది. 

తిరుపతి: గత ప్రభుత్వ హయాంలో పీలేరు పట్టణ పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ.శ్రీనాథరెడ్డిపైన అనేక ఆరోపణలు, విమర్శలువచ్చాయి. అయితే కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎం కాగానే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరి, టీటీడీ బోర్డు మెంబర్‌ అయ్యారు. ఇదే అదనుగా భావించి పీలేరు పట్టణ శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని ఎంవీఐ కార్యాలయ సమీపం నుంచి రింగ్‌రోడ్డు నిర్మించి రహదారి కిరువైపులా సుమారు 50 ఎకరాలు వివిధ బినామీ పేర్లపై చేజిక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడుగా కంకర మిషన్‌ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశారు. 

ఉనికే ప్రశ్నార్థకంగా
అంతలోనే రాష్ట్రం విడిపోవడం, ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి దిగిపోవడంతో జరిగిపోయాయి. దీంతో అధికారం దూరం కావడంతో మళ్లీ బాబు పంచన చేరారు. టీడీపీలో చేరినప్పటికీ అప్పటికే పార్టీలో ఉన్న చిన్నాచితక నేతలతోపాటు, నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జి ఈయనను పట్టించుకోక పోవడంతో ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కిరణ్‌ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరగానే పీలేరు ఇన్‌చార్జిగా నియమించారు. ఇక జీవీ రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని అందరూ భావించారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. 

వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు
ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో తన వారిని పురమాయించి వైఎస్సార్‌సీపీలో చేరడం కోసం రెండు నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీనికి తోడు పీలేరులో 20 రోజుల నుంచి తాను వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ఆయనే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం పీలేరు కోటపల్లెలోని జీ.వీ.శ్రీనాథరెడ్డి ఇంటికి వచ్చారు. సుమారు రెండు గంటల సేపు చర్చలు జరిపారు. పార్టీలో చేరుతానని జీవీ వారి ముందు నమ్మించారు. జీవీ వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని విషయం తెలియడంతో ఆ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో జీవీ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కేక్‌ కట్‌ చేయడం సత్కారాలు చేసుకోవడం  జగన్‌కు జైకొట్టడం, బాణా సంచా పేల్చుకుని సంబరాల్లో మునిగిపోయారు.  

టీడీపీ నేతల బెదిరింపులతో పరుగులు
ఇంతలోనే టీడీపీ నేతల నుంచి బెదిరింపుల రావడంతో హుటాహుటిన గోప్యంగా తిరుపతికి పరుగులు తీశారు. పార్టీ మారితే గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవడం, కంకర మిషన్‌ సీజ్‌ తదితర బెదిరింపుల పరంపర సాగింది. రాజకీయ జీవితంలో లేకపోయినా పర్వాలేదు, అప్పనంగా దోచేసిన కోట్లాది రూపాయల భూములు లాక్కుంటే నష్టపోతామన్న దురాశతో గంట వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్ట్రిప్ట్‌తో తిరుపతి తుడా కార్యాలయంలో సినిమా పక్కీలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తాను పార్టీ మారడంలేదని చెప్పారు. అయితే భూముల రెగులరైజేషన్‌ డీల్‌ కుదిరినట్లు జీవీని నమ్మించడానికి సోమవారం టీడీపీ నేతలతో కలెక్టర్‌ ఎదుటే చర్చించినట్లు సమాచారం. కలెక్టర్‌తో భేటీలో మంత్రి అమరనాథరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని పాల్గొనడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement