Srinatha reddy
-
డీల్ కుదిరింది!
పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్‌రెడ్డి గంటల వ్యవధిలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు. వైఎస్సార్సీపీలోకి వస్తున్నానంటూ సంకేతాలు పంపి తర్వాత కాదని ఎందుకు మాట మార్చారు.. ఇంతలా ఆయన్ను ప్రభావం చేసిన అంశాలేంటి అని పరిశీలిస్తే ఈ తతంగం వెనుక పెద్ద హైడ్రామానే నడిచింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి ‘తాయిలాలు’ ప్రకటించారనే అంశం ఇప్పుడు గుప్పుమంటోంది. తిరుపతి: గత ప్రభుత్వ హయాంలో పీలేరు పట్టణ పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ.శ్రీనాథరెడ్డిపైన అనేక ఆరోపణలు, విమర్శలువచ్చాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాగానే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. ఇదే అదనుగా భావించి పీలేరు పట్టణ శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని ఎంవీఐ కార్యాలయ సమీపం నుంచి రింగ్‌రోడ్డు నిర్మించి రహదారి కిరువైపులా సుమారు 50 ఎకరాలు వివిధ బినామీ పేర్లపై చేజిక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడుగా కంకర మిషన్ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశారు. ఉనికే ప్రశ్నార్థకంగా అంతలోనే రాష్ట్రం విడిపోవడం, ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి దిగిపోవడంతో జరిగిపోయాయి. దీంతో అధికారం దూరం కావడంతో మళ్లీ బాబు పంచన చేరారు. టీడీపీలో చేరినప్పటికీ అప్పటికే పార్టీలో ఉన్న చిన్నాచితక నేతలతోపాటు, నియోజక వర్గ పార్టీ ఇన్చార్జి ఈయనను పట్టించుకోక పోవడంతో ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరగానే పీలేరు ఇన్చార్జిగా నియమించారు. ఇక జీవీ రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని అందరూ భావించారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో తన వారిని పురమాయించి వైఎస్సార్సీపీలో చేరడం కోసం రెండు నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీనికి తోడు పీలేరులో 20 రోజుల నుంచి తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ఆయనే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం పీలేరు కోటపల్లెలోని జీ.వీ.శ్రీనాథరెడ్డి ఇంటికి వచ్చారు. సుమారు రెండు గంటల సేపు చర్చలు జరిపారు. పార్టీలో చేరుతానని జీవీ వారి ముందు నమ్మించారు. జీవీ వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని విషయం తెలియడంతో ఆ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో జీవీ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కేక్ కట్ చేయడం సత్కారాలు చేసుకోవడం జగన్‌కు జైకొట్టడం, బాణా సంచా పేల్చుకుని సంబరాల్లో మునిగిపోయారు. టీడీపీ నేతల బెదిరింపులతో పరుగులు ఇంతలోనే టీడీపీ నేతల నుంచి బెదిరింపుల రావడంతో హుటాహుటిన గోప్యంగా తిరుపతికి పరుగులు తీశారు. పార్టీ మారితే గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవడం, కంకర మిషన్ సీజ్ తదితర బెదిరింపుల పరంపర సాగింది. రాజకీయ జీవితంలో లేకపోయినా పర్వాలేదు, అప్పనంగా దోచేసిన కోట్లాది రూపాయల భూములు లాక్కుంటే నష్టపోతామన్న దురాశతో గంట వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్ట్రిప్ట్తో తిరుపతి తుడా కార్యాలయంలో సినిమా పక్కీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తాను పార్టీ మారడంలేదని చెప్పారు. అయితే భూముల రెగులరైజేషన్ డీల్ కుదిరినట్లు జీవీని నమ్మించడానికి సోమవారం టీడీపీ నేతలతో కలెక్టర్ ఎదుటే చర్చించినట్లు సమాచారం. కలెక్టర్‌తో భేటీలో మంత్రి అమరనాథరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని పాల్గొనడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. -
మట్కా గ్యాంగ్ ఆట కట్టు
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిల్లర వ్యాపారులు కష్టార్జితాన్ని జలగల్లా పీల్చుకు తింటున్న మట్కా గ్యాంగ్ సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. పాణ్యం సర్కిల్ పరిధిలోని రెండు ముఠాలను అరెస్ట్ చేసి, రూ.75వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ అమర్నాథ్నాయుడు, పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మట్కాగ్యాంగ్‌ల గురించి వివరించారు. పాణ్యం పరిధిలోని నెరవాటి వెంకటేశ్వర్లు, సాలబోయిన రాము, షేక్ఫ్రి, నాగేంద్ర, అచ్చకోట్ల జమాల్‌బాష, కాట్రావత్ రేఖానాయక్, పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతంలో మట్కా నిర్వహించేవారు. నంద్యాల పట్టణంలోని బషీర్(బొగ్గులైన్), షేక్ఫ్రి(కోటవీధి), పులిమద్ది వేణుగోపాల్(పెద్దబండ) జత కలిశారు. ఈ ముగ్గురు పట్టణంలో మట్కా కలెక్షన్లను సేకరించి, పాణ్యం గ్యాంగ్‌కు అప్పజెప్పేవారు. ఎవరికైనా మట్కా నెంబర్ తగిలినా ఈ గ్యాంగ్ గెలిచిన సొమ్మును ఇవ్వకుండా బెదిరించేవారు. ఈ గ్యాంగ్ సభ్యులను పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి పాణ్యంలోని మౌలాలిస్వామి దర్గావద్ద అరెస్ట్ చేసి రూ.53,320, 8సెల్ఫోన్లు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా నిర్వాహకుడు, అనుచరుల అరెస్ట్.. నందివర్గం ప్రాంతంలో పేరొందిన మట్కా నిర్వాహకుడు సయ్యద్ రఫీద్ అహ్మద్, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. రామకృష్ణపురంకు చెందిన సయ్యద్ రషీద్ అహ్మద్ కొన్నేళ్లుగా మట్కా నిర్వహిస్తూ ప్రస్తుతం బనగానపల్లెలో నివాసముంటున్నాడు. ఆయన పలుకూరు, రామతీర్థం, టంగుటూరు గ్రామాల్లో అనుచరులు షేక్ ఇస్మాయిల్, దళిత హుసేని, వడ్డగోగుల సుబ్బరాయుడు, మొల్లి మహ్మద్ హుసేన్‌లను బీటర్లుగా ఏర్పాటు చేసుకొని దందాను నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ గ్యాంగ్‌ను రామతీర్థంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.22వేలు, మూడు సెల్ఫోన్లు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా గ్యాంగ్‌ల అరెస్ట్‌లో కీలక పాత్రను వహించిన కానిస్టేబుల్ రమేష్‌కు డీఎస్పీ అమర్నాథ్నాయుడు, సీఐ శ్రీనాథరెడ్డి నగదు రివార్డును అందజేశారు. సమావేశంలో పాణ్యం, నందివర్గం ఎస్ఐలు సుబ్రమణ్యం, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.