సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సృష్టించే భయాందోళనల వల్లే కరోనా రోగులు చనిపోతున్నారని ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తే తలలు నరుక్కుంటామని గతంలో ప్రకటనలు చేసిన ప్రతిపక్ష నేతలు ప్రస్తుతం అల్జీమర్స్ సోకినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షం నీరు రావడం ఘటనకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రి గురించి 70 ఏళ్లలో ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ నేతలు ఆసుపత్రిని సందర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2015 లోనే ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తామనే కేసీఆర్ ప్రతిపాదనను కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, ఉత్తమ్, భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్, బీజేపీ నేతలే వ్యతిరేకించారన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలి తంగానే ఐదు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు.
ప్రతిపక్షాలది సైంధవ పాత్ర..
ప్రతిపక్షాలు సైంధవ పాత్ర పోషిస్తున్నాయని.. కోర్టులకు పోయి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిని ప్రస్తుతమున్నచోట మళ్లీ నిర్మించకపోతే మెడికల్ సీట్లు పోతాయనే జ్ఞానం కూడా ప్రతిపక్షాలకు లేదన్నారు. వారసత్వ కట్టడాల పేరిట కొత్త భవనాల నిర్మాణం అడ్డుకోవద్దని, ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకోబోమని ప్రతిపక్షాలు హామీ ఇస్తే ఏడాది లోపు కొత్త భవనం నిర్మిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment