సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీలో వారసుల పోటీ మొదలైనట్టు కనిపిస్తోంది. పలువురు రాష్ట్ర మంత్రులకు వారి వారసుల ఒత్తిడి, పనితీరు, వ్యవహార శైలి తలనొప్పిగా మారుతున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో తలమునకలైన వారికి కుటుంబ సభ్యుల చేదోడు వాదోడు సహజమే అయినా.. నియోజకవర్గాల్లో, శాఖాపరంగా పాలనా వ్యవహారాల్లో కొందరు వారసులు జోక్యం చేసుకుంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారుల బదిలీలు, సెటిల్‌మెంట్లు, ఇతర ఆర్థిక అంశాల్లోనూ కల్పించుకుంటున్నారు. ఇది వివాదాలకు దారితీస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ప్రత్య ర్థులే కాకుండా సొంత పార్టీ నేతల నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటిదాకా పాలనా అంశాలు, అంతర్గతంగా రాజకీయ నిర్ణయాల్లో జోక్యం వరకు పరిమితమైన వారసులు.. వచ్చే ఎన్నికల నాటికి స్వయంగా రాజకీయ గోదాలోకి దిగేందుకు ఎత్తులు వేస్తున్నారు.
రాజకీయ వారసత్వం కోసం..
కొందరు అమాత్యుల వారసులు బహిరంగంగానే తమకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కావాలని కోరుతున్నారు. మరికొందరు బయటపడకుండా అంతర్గతంగా పనులు చక్కబెడుతూ.. పార్టీలో, ఇతర వర్గాల్లో బలం పెంచుకుంటున్నారు. కొందరు వారసులు నియోజకవర్గంలో అన్నీ తామై దూకుడుగా పనిచేస్తున్నారు.
బహిరంగంగానే అభివృద్ధి కార్యక్రమాల్లో, పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ తండ్రి తరఫున చాలా కార్యక్రమాలకు వారే హాజరవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ అరంగేట్రం కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీలో అంతర్గత పోటీదారులపై, కుటుంబంలో పోటీ వారసులపై, ప్రత్యర్థి పార్టీల్లోని పోటీదారులపై పైచేయి సాధించడం కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికార యం త్రాంగంతోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోంది. ఇలా ఇద్దరు ముగ్గురు మంత్రుల వారసులు అత్యుత్సాహంతో తండ్రులకు ఇబ్బందులు తెచ్చిపెట్టడం.. వారి వ్యవహారశైలిపై మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం వంటి పరిస్థితులు కూడా తలెత్తాయి.
కుమార్తెలు, అల్లుళ్లు కూడా..!
కొందరు అమాత్యులకు రాజకీయ వారసులుగా వారి కుమార్తెలు, అల్లుళ్లు తెరపైకి వస్తున్నారు. రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి కుమార్తె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక హైదరాబాద్ నగరానికి చెందిన మరో కీలక మంత్రి అల్లుడు.. ఆయన రాజకీయ వారసునిగా తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన.. నగరంలోని ఓ అసెంబ్లీ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
దూకుడు.. వివాదాలు..
అధికారంలో ఉన్నప్పుడే రాజకీయాలకు అవసరమైన అర్థ, అంగ, ఇతర బలాల సమీకరణ కోసం కొందరు మంత్రుల వారసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం కావడం కోసం వివాదాస్పద భూముల్లోనూ, ఆస్తుల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు మంత్రుల తనయులు ఆర్థిక వ్యవహారాల్లో కలగజేసుకోవడం వివాదాస్పదంగా మారింది.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడి తీరు చాలాసార్లు మంత్రిని, పార్టీని ఇబ్బందులకు గురిచేసిందని.. పలువురు నేతల అనుచరులను బెదిరించారని టీఆర్‌ఎస్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఓ నేత ఆర్థిక వ్యవహారంలో తమను వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇలాంటి ఘటనలపై కొందరు ఫిర్యాదులు చేస్తుండగా.. అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకనే భయంతో చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. అయితే ఫిర్యాదులు రాకున్నా బెదిరింపుల ఫోన్‌కాల్ రికార్డులు, వీడియోలు, ఇతర మార్గాల్లో ఆ విషయాలు బయటపడి.. మంత్రులను అంతర్గతంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వారసులు!
♦ హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు మంత్రుల కుమారులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారిలో కొందరు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే ఆయా చోట్ల కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవకాశం లభించలేదు.
♦ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఓ నామినేటెడ్ పదవిలో ఉన్న ఆయన.. పార్టీ నేతలతో, అధికారులతో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి కుమారుడు ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి ప్రయత్నిస్తున్నారు.
♦ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యుల కుమారులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు కూడా రాజకీయ అవకాశాల కోసం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment