సాక్షి, బెంగళూరు : తమ తరపున ప్రచారాల్లో పాల్గొంటున్న హీరోలు దర్శన్, యశ్‌లు పంటల్ని మేసే జోడెద్దులంటూ వ్యాఖ్యానించి సీఎం కుమారస్వామి తన స్థాయి దిగజార్చుకున్నారని సుమలతా అంబరీష్ మండిపడ్డారు. తన భర్త, దివంగత కేంద్ర మంత్రి అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మంగళవారం శ్రీరంగపట్టణ తాలూకా కేఆర్‌ఎస్‌లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తన కుమారుడు నిఖిల్(కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మండ్య అభ్యర్థి) గెలుపు కోసం సీఎం కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జేడీఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించే సమయంలో పోని విద్యుత్ సరిగ్గా తాము నిర్వహించే సమావేశాల సమయంలోనే ఎలా పోతుందంటూ సుమలత ప్రశ్నించారు. తమ సమావేశాల సమయంలో కరెంట్ కట్ చేయకూడదంటూ సీఎం కుమారస్వామి విద్యుత్ అధికారులకు రాసిన లేఖను ఎన్నికల సంఘానికి సమర్పించామన్నారు. ‘హీరోలు యశ్, దర్శన్‌లు తమ తరఫున ప్రచారం చేస్తే సీఎం కుమారస్వామి ఓర్వలేకపోతున్నారన్నారు. గతేడాది విధానసభ ఎన్నికల్లో మంత్రి సా.రా మహేశ్ హీరో యశ్‌తో ఎన్నికల ప్రచారాలు చేయించుకున్న విషయాన్ని ఆయన ఓసారి గుర్తు చేసుకుంటే మంచిది’ని హితవు పలికారు. (రసవత్తరంగా మాండ్య పోరు!)
అంబరీశ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ..
‘కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థి తరపున సినీతారలు ప్రచారంలో పాల్గొంటే అది ప్రచారం. మా తరఫున పాల్గొంటే అనాచారం’ అనే విధంగా కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించడం వారి మనఃస్థితిని తెలియజేస్తోందని సుమలత పరోక్షంగా కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్‌ను విమర్శించారు. ఆయనకు నిఖిల్‌పై అంత ప్రేమ ఉంటే తమ్ముని నియోజకవర్గాన్ని కేటాయించి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. అది వదిలేసి మండ్యకు రావడమే కాకుండా అంబరీశ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఎన్నికల్లో నిఖిల్‌కి ఓట్లు వేయాలంటూ అడగమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాల్లో అంబరీశ్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నవారు మాటపై నిలబడాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మహిళలను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment